కఠ్మాండులో మనోళ్లు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:26 PM
నేపాల్ రాజధాని కఠ్మాండులో జిల్లా వాసులు చిక్కుకున్నారు.
- మానస సరోవరం యాత్రకు వెళ్లి చిక్కుకున్న 17మంది జిల్లా వాసులు
- కంట్రోల్ రూమ్‌కు అందిన సమాచారం
- తక్షణ సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
- కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ నెంబర్ 9491222122 ఏర్పాటు
శ్రీకాకుళం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి) : నేపాల్ రాజధాని కఠ్మాండులో జిల్లా వాసులు చిక్కుకున్నారు. జిల్లా నుంచి మానస సరోవ రం యాత్రకు వెళ్లిన 17 మంది పర్యాటకులు కఠ్మాండులో చిక్కుకుపోయినట్లు కలెక్టరేట్ సమాచార కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బుధవారం రాత్రి సమాచారం అందింది. దీంతో వారిని క్షేమంగా జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేశ్, వ్యవసాయమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కఠ్మాండులో చిక్కుకున్న వారితో ఫోన్‌లో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా జిల్లా నుంచి 17 మంది నేపాల్‌కు వెళ్లినట్లు తెలిసిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
కలెక్టరేట్‌లో అత్యవసర హెల్ప్‌లైన్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 10 (ఆం ధ్రజ్యోతి): నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం, లేదా సహాయం కోసం ప్రజలు 9491222122 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ఈ హెల్ప్‌లైన్‌ను పర్యవే క్షించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించామన్నారు. హెల్ప్‌లైన్‌కు వచ్చే ప్రతీ కాల్‌ను ఈ బృందం స్వీకరించి, అవసరమైన వివరాలను నమోదు చేసుకుంటుందన్నారు. సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తెలియజేసి, సహాయ చర్యల వేగవంతానికి కృషి చేస్తుందని తెలిపారు.