20రోజుల్లోనే పెన్షన్ ప్రయోజనాలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:02 AM
Pension benefits ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన 20రోజుల్లోనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ పేర్కొన్నారు.
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన 20రోజుల్లోనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ పేర్కొన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన పెన్షన్ అదాలత్‌లో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ‘ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలకా్ట్రనిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తాం. ఆన్‌లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 9 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ కేసులు అధికంగా ఉన్నాయి. నేరుగా పెన్షనర్లతో మాట్లాడి డీడీవోల సమక్షంలోనే వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. డీడీవోలు, పెన్షనర్ల సమన్వయంతో తక్షణ పరిష్కారం సాధ్యపడుతుంది. పెన్షనర్లకు డాక్యుమెంటేషన్‌ను స్వయంగా ఆన్‌లైన్‌లో చేసుకునే సౌకర్యం కూడా కల్పించాం. ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరుకున్న పెన్షన్ పత్రాలను పరిశీలించి పదవీ విరమణ బెనిఫిట్స్‌ను త్వరగా అందిస్తున్నాం. త్వరలోనే పెన్షన్ మంజూరు పత్రాలను ఎలకా్ట్రనిక్ పద్ధతిలో అందిస్తామ’ని శాంతిప్రియ తెలిపారు. పెన్షన్‌దారులకు అవగాహన కోసం గైడ్‌బుక్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్.మోహనరావు, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కుషాల్ కార్తీక్, పెద్ద ఎత్తున అధికారులు, పెన్షనర్లు పాల్గొన్నారు.