Share News

Coastal pollution: ప్రశాంత తీరం.. కాలుష్య కల్లోలం

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:50 PM

Environmental crisis Beach pollution రాష్ట్రంలోనే అత్యధిక తీర ప్రాంతం సిక్కోలు సొంతం. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాకు సుదీర్ఘ సముద్ర తీరం వరమే అయినా.. ఒక్కోసారి సముద్రుడి ఉగ్రరూపం ప్రజలను ఇబ్బందుల్లో పెడుతోంది. సుమారు 25 శాతం ఆక్సిజన్‌ను అందించే సముద్రం.. కొన్నిసార్లు విపత్తుల రూపంలో అలజడి సృష్టిస్తోంది.

Coastal pollution: ప్రశాంత తీరం.. కాలుష్య కల్లోలం
సముద్రంలో కలుస్తున్న పరిశ్రమ రసాయన వ్యర్థాలు

  • జిల్లాకు చెంతనే బంగాళాఖాతం

  • మానవ తప్పిదాలతో ప్రమాదకరం

  • ఏటా విపత్తులతో భయం భయం

  • లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం

  • మత్స్యకార కుటుంబాల్లోనూ అలజడి

  • నేడు ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం

  • సముద్రం.. సమస్త జీవరాశులకు మూలాధారం. ప్రాణవాయువు కూడా. సముద్రంలోని ఆల్గేగా పిలిచే పైటోప్లవకం (నిమ్న వృక్షజాతి) దాదాపు 25శాతం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. సంద్రం ద్వారా మత్స్యసంపదతోపాటు.. మాంగనీసు, కోబాల్డు, నికెల్‌ వంటి లోహమూలకాలతో ఉపాధి లభిస్తోంది. బంగాళాఖాతంతీరానికి చెంతనే జిల్లా ఉండడం గొప్ప వరం. అయితే మానవ తప్పిదాల కారణంగా సముద్రం కాలుష్యంబారిన పడుతోంది. తరచూ విపత్తుల రూపంలో అలజడి రేగుతూ తీరని నష్టం వాటిల్లుతోంది. ఆదివారం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

  • ...................

  • రణస్థలం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అత్యధిక తీర ప్రాంతం సిక్కోలు సొంతం. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాకు సుదీర్ఘ సముద్ర తీరం వరమే అయినా.. ఒక్కోసారి సముద్రుడి ఉగ్రరూపం ప్రజలను ఇబ్బందుల్లో పెడుతోంది. సుమారు 25 శాతం ఆక్సిజన్‌ను అందించే సముద్రం.. కొన్నిసార్లు విపత్తుల రూపంలో అలజడి సృష్టిస్తోంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యపూరిత అంశాల మూలంగా భూతలం మీదుగా వెళ్లాల్సిన రుతుపవనాలు.. సముద్రం మీదుగా సాగుతున్నాయి. దీంతో అలల తీవ్రత పెరగుతోంది. అతివృష్టితో భారీగా వర్షాలు కురుస్తుండడం, వరుస విపత్తులు.. జిల్లా వాసులకు తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. తీరప్రాంతం ఆక్రమణలతోపాటు.. కాలుష్యం బారిన పడుతుండడమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.

  • తీరంలో సామాజిక అటవీ ప్రాంతంలో 5 వేల ఎకరాలను అక్రమార్కులు ఆక్రమించేశారు. ఈ భూముల్లోనే రొయ్యల చెరువులు వేశారు. జీడి తోటలు సాగు చేస్తున్నారు. తీరానికి 500 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాలు జరపకూడదన్న సీఆర్‌జెడ్‌ నిబంధన ఉంది. కానీ తీరం చెంతనే 40 గ్రామాలు ఉండడం గమనార్హం. గాలుల తీవ్రత తగ్గించే తాటిచెట్లు, సరుగుడు, నీలగిరి తదితర చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. అలల తాకిడికి తట్టుకునే మడ అడవులు, మొగలిపొదలు కనుమరుగవుతున్నాయి. కాలుష్యంతో సముద్రంలో ఆక్సిజన్‌ ఇచ్చే నిమ్నవృక్ష జాతిగా పిలిచే నాచు నాశనం అవుతోంది. జిల్లాలోని ప్రవహించే వంశధార, నాగావళి, మహేంద్రతనయా, బాహుదా నదుల ద్వారా కాలుష్యం వచ్చి సముద్రంలో కలుస్తోంది. ఇంకోవైపు రణస్థలం, ఎచ్చెర్ల ప్రాంతాల్లో రసాయన పరిశ్రమల కాలుష్యాలు సముద్రంలో చేరుతున్నాయి. ఇటువంటి మానవ తప్పిదాలతో తీరప్రాంతాన్ని పాడుచేసుకుంటున్నాం. సముద్రుడి ఉగ్రరూపానికి మూల్యం చెల్లించుకుంటున్నాం. కాలుష్యం, రసాయనాలు కారణంగా విలువైన మత్స్యసంపదతోపాటు.. అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి.

  • విపత్తులతో విలవిల...

  • సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ విపత్తుల కాలం. ఆ సమయంలో తుఫాన్‌ అన్న మాట వింటే మత్స్యకారులతో పాటు జిల్లా ప్రజలు వణికిపోతారు. ఇప్పటివరకూ వాటితో చవిచూసిన నష్టాలే కళ్ల ముందు కదులుతుంటాయి.

  • 1999లో సూపర్‌ సైక్లోన్‌ సంభవించింది. ఒడిశాలో తీరం దాటినా ఆ ప్రభావం మన తీరప్రాంతంపై పడింది. ఉద్దానంలో 12 లక్షలకుగాపై కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. 20 వేల ఎకరాల్లో జీడితోటలు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు మత్స్యకారుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపింది.

  • 2004లో సునామీ విధ్వంసం సృష్టించింది. ఒక్కసారిగా రాకాసి అలలు మత్స్యకారుల గ్రామాల్లోకి చొచ్చుకొచ్చాయి. సముద్రుడి విశ్వరూపం చూసి మత్స్యకారులు హడలెత్తిపోయారు. చాలా రోజుల వరకూ వేటకు వెళ్లాలంటే భయపడ్డారు.

  • 2013లో ఫైలిన్‌ తుఫాను జిల్లాలోనే బారువ వద్ద తీరం దాటింది. ఆ సమయంలో ఈదురుగాలులకు 8 లక్షలకుపైగా కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 8వేల ఎకరాల్లో జీడితోటలు ధ్వంసమయ్యాయి.

  • 2014లో సంభవించిన హుద్‌హుద్‌ సైతం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. 3.5 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఐదు వేల ఎకరాల జీడితోటలకు నష్టం వాటిల్లింది. ఐదువేల మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

  • 2018లో తితలీ తుపాను జిల్లా ప్రజల బతుకులను అతలాకుతలం చేసింది. వందేళ్ల చరిత్రలోనే ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. 1.5లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలైన జీడి, కొబ్బరికి దారుణంగా దెబ్బతీసింది. 11 తీర మండలాల్లోని మత్స్యకారుల జీవన స్థితిగతులను మార్చేసింది.

  • మత్స్యకారుల గణాంకాలు..

    జిల్లాలో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 164 మత్స్యకార గ్రామాలున్నాయి. లక్షకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 15,375 మంది మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు. 65వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇంజన్‌ ఆధారిత పడవలు 6వేలు ఉన్నాయి. వేట సాగించే రేవులు 120. ఏటా 1,48,302 మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది. రూ.800కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్లు, జెట్టీలు అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ రీతిలో వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక జిల్లా నుంచి వేలాదిమంది మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌, ముంబాయి, కోల్‌కత్తా, పారాదీప్‌ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

  • ఇప్పుడిప్పుడే పురోగతి

    టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-2019 మధ్య) తీరం వెంబడి రక్షణకు భారీగా మొక్కలు పెంచాలని ప్రణాళిక వేశారు. అలాగే సంతబొమ్మాళి మండలం భావనపాడులో హార్బర్‌ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది, ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భావనపాడులో హార్బర్‌ నిర్మాణం నిలిచిపోయింది. వైసీపీ పాలనలో భావనపాడులో కాకుండా.. ఇదే మండలంలోని మూలపేటలో హార్బర్‌ నిర్మాణానికి అప్పటి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. కానీ పనులు సక్రమంగా సాగలేదు. అలాగే వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి వైసీపీ ప్రజాప్రతినిధులు హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పనులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. త్వరితగతిన పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది.

  • పర్యాటకంగా అభివృద్ధి చేస్తేనే..

    ఇంతటి సముద్ర తీరం ఉన్నా.. జిల్లా అభివృద్ధి చెందడం లేదు. తీరాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తే వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగపడతాయి. 11 తీర మండలాల్లో పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. జిల్లాలో టెక్కలి మండలం తేలినీలాపురం, ఇచ్ఛాపురం మండలం తేలికుంచిలో సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా విదేశీ విహంగ కేంద్రాలు ఉన్నాయి. సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం కావడంతో.. ఏటా ఇక్కడకు సైబీరియా, జర్మనీ తదితర ప్రాంతాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ పక్షులు చేరుకుంటాయి. ఏడాదిలో సుమారు ఏడు నెలలపాటు ఇక్కడే ఉంటాయి. స్థానికులను కనువిందు చేస్తాయి. గుడ్లు పెట్టి.. సంతానోత్పత్తి తరువాత తిరిగి వెళ్లిపోతాయి. సెప్టెంబరు, అక్టోబరులో ఇక్కడకు చేరుకుని.. మార్చి, ఏప్రిల్‌లో పయనమవుతాయి. ఈ విదేశీ విహంగ కేంద్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే.. మరింత ఆహ్లాదంగా మారనున్నాయి.

  • ప్రజల్లో చైతన్యం నింపాలి

    జిల్లా వెంబడి తీరం ఉండడం వరం. కానీ అదే సముద్రం ఉగ్రరూపం దాల్చుతుండడంతో ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే తీరప్రాంత రక్షణకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వాల చర్యలతోపాటు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. దీనిపై స్వచ్ఛంద సంస్థలతోపాటు విద్యాసంస్థలు చైతన్యం కలిగించాలి. తీరాన్ని పరిరక్షించుకుంటేనే భావితరాలకు మెరుగైన భవిత ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

    - కూన రామం, పర్యావరణవేత్త, బుడుమూరు

Updated Date - Jun 07 , 2025 | 11:50 PM