Share News

రోమ్‌ చక్రవర్తిలా పవన్‌ కళ్యాణ్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:59 PM

రాష్ట్రంలోని సమస్యలపై తనకు సంబంధం ఉందోలేదో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రజలకు స్పష్టం చేయాలని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

రోమ్‌ చక్రవర్తిలా పవన్‌ కళ్యాణ్‌
మాట్లాడుతున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌

- ఆయన నిద్రావస్థలో ఉన్నారు

- బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌

పలాస, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సమస్యలపై తనకు సంబంధం ఉందోలేదో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రజలకు స్పష్టం చేయాలని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏఘటన జరిగినా నగరం కాలిపోతుంటే రోమ్‌ చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా పవన్‌కళ్యాణ్‌ ఉన్నారన్నారు. పలాస కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 9 మంది మరణించడం.. 18 మంది గాయపడడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు, మృతుల బంధువులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం పలాస కాశీబుగ్గకు వచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేలు, గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ.10వేల చొప్పున సాయాన్ని అందించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు. మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఏం సంబంధం లేనట్లు పవన్‌ కళ్యాణ్‌ నిద్రావస్థలో ఉన్నారని విమర్శించారు. ఆయనకు అధికారం లేకున్నా కేవలం ఉత్సవ విగ్రహం లాంటి పదవులు ఉన్నాయన్నారు. పలాస ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆలయమని తప్పించునే ప్రయత్నం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే తమకు సంబంధం లేదని ప్రకటనలు ఇస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిఘా, పోలీసు వ్యవస్థను రాజకీయాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.

Updated Date - Nov 04 , 2025 | 11:59 PM