mini mahanadu : కార్యకర్తలే టీడీపీకి అండ
ABN , Publish Date - May 19 , 2025 | 12:15 AM
Party workers Political support ‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ. కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నా వారిని విస్మరించేది లేదు. అర్థరాత్రి ఫోన్ చేసినా వారికి అండగా ఉంటాను. కార్మికుల సంక్షేమమే ధ్యేయమ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
వారిని విస్మరించేది లేదు
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళిలో మినీమహానాడు విజయవంతం
టెక్కలి, మే 18(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ. కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నా వారిని విస్మరించేది లేదు. అర్థరాత్రి ఫోన్ చేసినా వారికి అండగా ఉంటాను. కార్మికుల సంక్షేమమే ధ్యేయమ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో మినీమహానాడు సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరుకాగా.. పార్టీ జెండాను అచ్చెన్న ఎగురవేసి.. ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భవించి 43 ఏళ్లు అయింది. అందులో 23ఏళ్లు అధికారంలో ఉన్నామంటే .. దాని వెనుక కార్యకర్తల కృషి ఎనలేనిది. టీడీపీ బాధ్యతాయుతమైన పార్టీ. కోటి 3లక్షల సభ్యత్వాలతో పటిష్టంగా ఉంది. గ్రామస్థాయి, మండలస్థాయి కమిటీలతో బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభివృద్ధితోనే గెలిచి తీరుతాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం కూడా చేయకూడదు. సంపద సృష్టించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యం. కార్యకర్తలకు, నాయకులకు మధ్య విభేదాలు లేకుండా కలిసి పనిచేసే దిశగా పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపిద్దాం. అప్పులో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారు. మహానాడు తర్వాత సూపర్‌సిక్స్ హామీలు క్యాలెండర్ రూపేనా విడుదల చేస్తారు. ఈ నెల 27 నుంచి కడపలో జరిగే టీడీపీ మహానాడు విజయవంతం చేయడానికి కార్యకర్తలు తరలిరావాల’ని పిలుపునిచ్చారు.
భావనపాడులో హార్బర్..
భావనపాడులో హార్బర్ మంజూరుకు కృషి చేసి మత్స్యకారులను ఆదుకుంటామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘టెక్కలి నియోజకవర్గాన్ని 2029 నాటికి అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా. నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా తారురోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టెక్కలి, నరసన్నపేట ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.1,200కోట్లు మంజూరయ్యాయి. సంతబొమ్మాళి మండలంలో పదివేల ఎకరాల్లో పారిశ్రామిక రంగం విస్తరించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందకు కృషి చేస్తాం. రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించి ఆదాయ వనరులు పెంచుకోవాలి. రైతులకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరిస్తాం. ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి ద్వారా వంశధారకు నీరందిస్తామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.
వైసీపీ అరాచక పాలనలో అక్రమ కేసులతో నాతో సహా కార్యకర్తలందరూ నిద్రలేని రాత్రులు గడిపాం. గత ఐదేళ్లు ఇష్టారాజ్యంగా నోరుపారేసుకొని చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో కనబడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీ చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టేది లేదు’ అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎల్‌ఎల్ నాయుడు, బోయిన గోవిందరాజులు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి మండల పార్టీల అధ్యక్షులు బోయిన రమేష్, పినకాన అజయ్‌కుమార్, జీరు భీమారావు, వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, హనుమంతు రామకృష్ణ ఉన్నారు.