పలాస జీడి భేష్
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:44 PM
Cashew Industry ‘పలాస జీడి నిర్వహణ, విధానం బాగుంది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా కీర్తి గడిస్తుందన్న నమ్మకం ఉంద’ని తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఎన్.వెంకటేష్ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేష్
పలాస, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘పలాస జీడి నిర్వహణ, విధానం బాగుంది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా కీర్తి గడిస్తుందన్న నమ్మకం ఉంద’ని తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఎన్.వెంకటేష్ అన్నారు. శనివారం పలాస జీడి పారిశ్రామికవాడలో జీడిపప్పు నిర్వహణ విధానాన్ని ఆయన పరిశీలించారు. తిరుమలతిరుపతి దేవస్థానానికి జీడిపప్పు సరఫరా చేస్తున్న ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ జీడి పరిశ్రమను పరిశీలించి.. జీడిపిక్కలు బాయిలింగ్ నుంచి జీడిపప్పు ప్యాకింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం జాతీయంగా పలాస జీడిపప్పును గుర్తించి ఈ నెల 14న ఢిల్లీలో అవార్డు ఇవ్వనుందని వ్యాపారులు, అధికారులు చెప్పడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జీడి పరిశ్రమ నెలకొల్పడంపై నిర్వాహకులకు అభినందించారు. కార్మికుల వేతనాలు, జీడిపిక్కల ధరలు, కొనుగోళ్లు, విదేశీ పిక్కల వ్యవహారంపై ఆరా తీశారు. కుటీర పరిశ్రమలుగా ప్రారంభించి నేడు అంతర్జాతీయస్థాయిలో ప్రవేశించాయని జీడి పరిశ్రమల యాజమాన్యసంఘం అధ్యక్షులు మల్లా రామేశ్వరరావు, మల్లా శ్రీనివాసరావులు ఆయనకు వివరించారు. అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్డీఓ జి.వెంకటేష్, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, జీడి పరిశ్రమల సంఘం నేతలు సాదరంగా ఆహ్వానించారు.