Kharif of hardship: కష్టాల ఖరీఫ్
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:59 PM
agricultural crisis ఖరీఫ్ సీజన్ వేళ.. జిల్లాలో ప్రస్తుతం ఆశించినస్థాయిలో వర్షాలు లేక వరినారు(ఆకుమళ్లు) ఎండిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలాఖరు నాటికే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. జూన్‌లో అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో వరి నారు తయారు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
సీజన్ ఆరంభంలోనే ఇబ్బందులు
ఎండిపోతున్న వరినారు, ఎదలు
ఆందోళనలో రైతులు
వర్షం కోసం ఎదురుచూపులు
టెక్కలి రూరల్/ సరుబుజ్జిలి/పలాస రూరల్/ ఎల్.ఎన్.పేట, జూలై 14(ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సీజన్ వేళ.. జిల్లాలో ప్రస్తుతం ఆశించినస్థాయిలో వర్షాలు లేక వరినారు(ఆకుమళ్లు) ఎండిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలాఖరు నాటికే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. జూన్‌లో అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో వరి నారు తయారు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. కొంతమంది రైతులు బురదలోనే వరినారు వేశారు. కాగా, గత 20 రోజుల నుంచి వర్షాలు సక్రమంగా కురవకపోవడం, ఎండలు తీవ్రత పెరగడంతో వరినాట్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో నీటిని ఇంజన్ల ద్వారా అందించి.. వరినారుని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మరికొందరు గూడలు ఏర్పాటు చేసుకుని వరినారుకి నీటితడి అందిస్తున్నారు.
జిల్లాలో 4,47,382 ఎకరాల్లో వరిసాగు చేయనున్నారు. ఈ ఏడాది 1.45 లక్షల ఎకరాల్లో దమ్ముల ద్వారా వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారని వ్యవసాయ అధికారుల అంచనా. మిగిలిన రైతులు ఎద ద్వారా సాగు చేయనున్నారు. ఏటా జూలైలో దమ్ములు ప్రారంభమై వరినాట్లు వేస్తారు. కానీ, ఈ ఏడాది వర్షాలు లేక వరినాట్లు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వరినారు ఎండిపోతోందని, ఖరీఫ్ ఆరంభంలోనే తమకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని పేర్కొంటున్నారు. టెక్కలి, మెళియాపుట్టి తదితర మండలాల్లోని ఆకుమడులు, ఎదలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. పలాస మండలంలోని కైజోల, రెంటికోట, బ్రాహ్మణతర్లా, లక్ష్మీపురం, గోపాలపురం, కేశుపురం, నారాయణపురం, నీలిబద్ర, బంటుకొత్తూరు గ్రామాలతోపాటు గిరిజన, ఉద్దాన ప్రాంతాల్లో రైతులు ఎదల రూపంలో విత్తనాలు చల్లారు. ఆయా రైతులంతా వరుణుడి కరుణకోసం ఎదురుచూస్తున్నారు.
సరుబుజ్జిలి మండలం కొండవలసలో సైలాడ చెరువు ఆయకట్టు కింద సుమారు 600 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల వంశధార కుడికాలువ ద్వారా అధికారులు సాగునీటిని విడుదల చేశారు. కానీ, కొద్దిగంటల్లోనే మళ్లీ సాగునీటిని నిలిపేశారు. పూడికతీత పనులు పూర్తికాకపోవడంతో కాల్వలో నీటిని కిందిస్థాయికి రాకుండానే నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపైర్లు ఎండిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వంశధార కాలువ ద్వారా సక్రమంగా సాగునీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
ఎల్.ఎన్.పేట మండలం తురకపేట, కృష్ణాపురం, పొడుగుపడు, బరటాం, దబ్బపాడు, వాడవలస, ధనుకువాడ, మిరియాపల్లి, కోవిలాం, రావిచెంద్రి, చింతలపబడవంజ, చిట్టిమండలం, శ్యామలాపురం, డొంకలబడవంజ, కొత్తపేట, కొమ్మువలస, బొత్తాడసింగి, జాడుపేట, ఫాక్స్‌దొరపేట తదితర గ్రామాల్లో వరినారు మళ్లు, ఎద పొలాలు ఎండిపోతున్నాయని రైతులు దిగులు చెందుతున్నారు. వంశధార నది కుడి ప్రధాన కాలువ పక్కనే ఉన్నా తమకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కుడికాలువ ద్వారా అధికారులు ఇటీవల నీరు విడుదల చేసినా.. దిగువన ఉన్న తమ పొలాలకు రావాలంటే సుమారు వారం పదిరోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఈలోగా వర్షాలు కురవకపోతే తమకు పంట నష్టం తప్పదని వాపోతున్నారు.