పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:17 AM
Government scheme Economic upliftment ‘ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. లక్ష్యసాధనకు ప్రతీ ఒక్కరూ సహకరించాల’ని ఎంఎస్‌ఎంఈ, ఎన్నారై, సెర్ప్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 5(ఆంధ్రజ్యోతి): ‘ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. లక్ష్యసాధనకు ప్రతీ ఒక్కరూ సహకరించాల’ని ఎంఎస్‌ఎంఈ, ఎన్నారై, సెర్ప్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్ అధ్యక్షతన ‘విజన్-2047’ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన 20శాతం కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థికంగా పునరుద్ధరించడానికి పీ-4 కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ధనవంతులు మార్గదర్శులుగా నిలిచి, బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఆ కుటుంబాలకు నేరుగా మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యం. ఇందుకుగాను నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్ తయారు చేసి, అమలు చేస్తాం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల’ని కోరారు.
దీర్ఘకాలిక అభివృద్ధి : మంత్రి అచ్చెన్నాయుడు
పీ-4 కేవలం దాతృత్వానికే పరిమితం కాదని, దీర్ఘకాలిక అభివృద్ధే లక్ష్యం కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. గ్రామాల్లో సచివాలయ సీనియర్ సిబ్బంది, ఇతర అధికారులు, నాయకులు ఒకరు లేదా ఇద్దరు మార్గదర్శులను గుర్తించాలని తెలిపారు. దీనివల్ల కార్యక్రమం నిర్దేశిత సమయంలో విజయవంతమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు ముందడుగు వేయాలని సూచించారు. పీ-4ను జయప్రదం చేస్తే.. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతందని స్పష్టం చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో 10 శాతం అత్యధిక ధనవంతులను గుర్తించి 20శాతం పేద కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. గ్రామ/వార్డు సచివాలయా డేటా ఆధారంగా పీ-4 సర్వేను చేశాం. దీని ద్వారా జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలను గుర్తించామ’ని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఆయా శాసనసభ్యుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలను ఆమోదించారు. ఆయా కమిటీల కార్యాలయాలను నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. కార్యక్రమంలో ఆమదాలవలస, నరసన్నపేట ఎమ్మెల్యేలు కూన.రవికుమార్, బగ్గు రమణమూర్తి పాల్గొని పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎనిమిది నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.