పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:31 PM
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలు
- ఆగస్టు 15 నాటికి దత్తత పూర్తి కావాలి
- రేపటి నుంచి గ్రామ సభలు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 16(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం కన్సల్టెంట్ బి.బలరాం బంగారు కుటుంబాల ఎంపిక, దత్తత విధానాలపై అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పీ-4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 75,566 బంగారు కుటుంబాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో కేవలం 9,494 కుటుంబాలు మాత్రమే దత్తతకు ఎంపికయ్యాయని అన్నారు. పలాస, జి.సిగడాంలో దత్తత శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి దత్తత ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీలో తప్పులు ఉండరాదని, కొన్ని మండలాల్లో మార్గదర్శకుల గుర్తింపు ఆలస్యం అవుతోందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 18 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించి 25లోగా తుది జాబితా తయారు చేయాలని ఆదేశించారు. బంగారు కుటుంబాలను ఆర్థికంగా, విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. రూట్స్ యాప్ ద్వారా ప్రజల నుంచి వివరాలను సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ప్రణాళిక విభాగం అధికారులు, విజనరీ ప్లాన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.