Share News

మా కుమారుడ్ని విడుదల చేయాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:09 AM

former Maoist Dunna Kesava Rao"s mother request తమ కుమారుడ్ని జైలు నుంచి విడుదల చేయాలని మాజీ మావోయిస్టు దున్న కేశవరావు(ఆజాద్‌) తల్లి కోమలమ్మ ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మా కుమారుడ్ని విడుదల చేయాలి
భువనేశ్వర్‌లోని కేంద్ర కారాగారం వద్ద ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న కేశవరావు తల్లి కోమలమ్మ, ప్రజాసంఘాల నాయకులు

మాజీ మావోయిస్టు దున్న కేశవరావు తల్లి కోమలమ్మ విజ్ఞప్తి

భువనేశ్వర్‌ కేంద్ర కారాగారం వద్ద నిరసన

పలాస, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తమ కుమారుడ్ని జైలు నుంచి విడుదల చేయాలని మాజీ మావోయిస్టు దున్న కేశవరావు(ఆజాద్‌) తల్లి కోమలమ్మ ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన కేశవరావు మావోయిస్టు పార్టీ కీలకసభ్యుడిగా, కమాండెంట్‌గా వ్యవహరించేవారు. 2011 మే 15న కేశవరావు అప్పటి డీజీపీ కె.అరవిందరావు సమక్షంలో హైదరాబాద్‌లో లొంగిపోయారు. కాగా ఒడిశా రాష్ట్రంలో కూడా దున్న కేశవరావుపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేశవరావును అదే నెల 29న ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. జూన్‌ 2న అరెస్టు చేసి భువనేశ్వర్‌ కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఆయన సుమారు 15 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నారు. కేశవరావు ఇటీవల తన విడుదల కోసం సుప్రీకోర్టు, మానవహక్కుల సంఘానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆయన పిటీషన్‌పై స్పందిస్తూ 2026 ఆగస్టు 31వ తేదీ నాటికి ఆయనపై ఉన్న అన్నీ కేసులపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబరులో విచారణ ప్రారంభించాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. ఇంకా దీనిపై స్పందన లేదు. దీంతో కేశవరావు ఒడిశా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జైలులోనే నిరాహారదీక్ష చేపడుతున్నారు. కేవలం మంచినీరు తాగి, ఇతర ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయం తెలిసి.. ఆయన తల్లి దున్న కోమలమ్మ గురువారం భువనేశ్వర్‌ కేంద్ర కారాగానికి వెళ్లారు. అక్కడ ప్రజాసంఘాలు, మానవతావాదులతో కలిసి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. తమ కుమారుడ్ని విడుదల చేయాలని కోరారు. ఇటీవల ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 18 , 2025 | 12:10 AM