మా రూటే వేరు!
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:32 AM
జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలు చాలా ఉన్నాయి.
అడ్డదారిలో ఇసుక తరలింపు
రోజూ వందలాది వాహనాల్లో..
నిఘాకు చిక్కకుండా రవాణా
కొందరు అధికారుల సహకారం?
- జేఆర్‌పురంలోని రామతీర్థాలు రోడ్డులో నిత్యం ఇలా ఇసుక లారీలు తరలిపోతున్నాయి. ఈ మార్గం పగలంతా రద్దీగా ఉంటుంది. కానీ, సాయంత్రం 7 గంటలు దాటిన తరువాత దొడ్డిదారిలో ఇసుక లారీల రాక మొదలవుతుంది. ఉదయం 5 గంటల వరకూ దాదాపు 100 ఇసుక లారీలు ఇదే రూట్లో వెళ్తుంటాయి. నెల్లిమర్ల మీదుగా విజయనగరం, విశాఖ నగరాలకు ఇసుక అక్రమంగా తరలిపోతుంది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
రణస్థలం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం అధికారికంగా రీచ్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తోంది. కానీ, ఉచితం మాటున ఇసుక లూటీ యథేచ్ఛగా జరుగుతుంది. ఇసుకాసురులు జాతీయ రహదారి గుండా కాకుండా.. అంతర్ జిల్లా లింకు రహదారులను మార్గాలుగా ఎంచుకొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా రణస్థలం మీదుగా నెల్లిమర్ల..అక్కడ నుంచి విజయనగరం, ఆపై విశాఖ నగరాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా మౌనం దాల్చుతుండడం అనుమానాలకు తావిస్తోంది. వారికి మామ్మూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల ప్రమేయం..
వాస్తవానికి పైడిభీమవరం వద్ద ఇసుక లారీలను నియంత్రించేందుకు ఉన్నతాధికారులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. తప్పుడు వే బిల్లులతో ఇసుక తరలిస్తున్న వాహనాలు ఈ చెక్‌పోస్టు వద్ద గతంలో పట్టుబడ్డాయి. దీంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఇసుకాసురులు రూటుమార్చారు. రణస్థలం మండల కేంద్రంలోని రామతీర్థాలు జంక్షన్ వద్ద ఇసుక వాహనాలు యూటర్న్ తీసుకుని, కమ్మసిగడాం, రామతీర్థాలు, నెల్లిమర్ల మీదుగా విజయనగరం, ఆపై విశాఖకు వెళ్తున్నాయి. ఇలా ప్రతిరోజూ జిల్లా నుంచి 150 లారీల ఇసుక విశాఖకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సగానికి సగం నకిలీ వే బిల్లులతోనే ఇసుక తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయం కంటే కొందరి అధికారుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రమేయం లేకుండా ఇసుకను సరిహద్దులు దాటించడం అంత సులువు కాదు. అంతర్ జిల్లా చెక్‌పోస్టులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ కళ్లుగప్పి ఇసుక తరలించుకుపోతున్నారంటే వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారులు ఎవరు? అన్నది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
లారీలకు బదులు టిప్పర్లు
గతంలో ఇసుక తరలించేందుకు అక్రమార్కులు ఎక్కువగా లారీలను వినియోగించేవారు. కానీ, ఇప్పుడు భారీ స్థాయిలో టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. లోతైన క్యాబిన్ ఉండడంతో ఒక్కో టిప్పర్‌లో 10 టన్నుల వరకూ ఇసుక పడుతుంది. అంటే 8 ట్రాక్టర్ల లోడును ఒకేసారి టిప్పర్‌లో తీసుకెళ్లవచ్చు. టిప్పర్ ఇసుక రూ.30 వేల పైమాటే. దూరం బట్టి దీని ధర పెరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
నిఘా పెట్టాం..
ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని ఇసుకను ఉచితంగా అందిస్తోంది. కానీ, కొందరు ఇసుకను దొడ్డిదారిన తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. పైడిభీమవరం చెక్‌పోస్టు వద్ద సైతం కట్టుదిట్టం చేస్తాం.
-ఎస్.కిరణ్‌కుమార్, తహసీల్దార్, రణస్థలం