Share News

బీపీ‘ఎస్‌’!

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:51 PM

Regularization of illegal structures అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండురోజుల కిందట పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ దీనికి సంబంధించిన జీఓ నెంబరు 225ను విడుదల చేశారు.

బీపీ‘ఎస్‌’!
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఏరియా వ్యూ

  • అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం

  • ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ నోటిఫికేషన్‌

  • నిర్మాణదారులకు అవగాహన కల్పించడానికి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సమాయత్తం

  • పలాస, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండురోజుల కిందట పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ దీనికి సంబంధించిన జీఓ నెంబరు 225ను విడుదల చేశారు. దీని ప్రకారం 1985 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీలోగా నిర్మించిన అక్రమ కట్టడాలు చట్టబద్ధం చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. మొత్తం ఈ ప్రాంతంలో వెయ్యికిపైగా గృహాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో బీపీఎస్‌ పథకాన్ని ప్రకటించడంతో జిల్లాలో వేలాది గృహాలు క్రమబద్ధీకరించారు. ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ దీన్ని ప్రకటించడం విశేషం.

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాభివృద్ధిశాఖకు సంబంధించి నిర్మాణదారులకు ఎటువంటి ఊరట ఇచ్చే ప్రకటనలు చేయలేదు. చిన్నచిన్న పొరపాట్లతో నిర్మించిన భవనాలకు భారీ జరిమానా విధించడంతో నిర్మాణదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. కొన్నిసార్లు మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ అధికారులు కోర్టులో దావాలు వేసి కనీసం 50శాతం అపరాధ రుసుం విధించి అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరించారు. అటువంటి వారందరికీ ఊరటనిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మళ్లీ బీపీఎస్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో అక్రమ నిర్మాణదారులు ఆనంద పడుతున్నారు. ప్రభుత్వ భూములు, దేవదాయ, సాగర్‌, నది, వాగు, గట్లుపై ఉన్న భవనాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం జరగదని అధికారులు స్పష్టం చేశారు.

  • అక్రమ నిర్మాణదారులు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే రిజిస్ట్రర్‌ సేల్‌డీడ్‌ పత్రాలు, ఈసీ, మార్కెట్‌ ధర, ఫ్లాన్‌, ఇంటి నిర్మాణం ఫొటో, ఇండెంటిటీ బాండ్‌లను ప్రభుత్వం విడుదల చేసిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. భూమి విలువ ఆధారంగా నగదు చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న సమయంలో రూ.10వేలు తప్పనిసరిగా చెల్లించాలి. 120 రోజుల్లోగా నిర్మాణదారులు దీనికి దరఖాస్తు చేసుకోవాలని పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించింది.

  • ప్రజలకు అవగాహన కల్పించేందుకు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు. పలాస-కాశీబుగ్గలో వందలాదిగా అక్రమ భవనాలు ఇప్పటికే గుర్తించారు. దీంతోపాటుగా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన గృహాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. 2017లో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు కారణంగా వందకు పైగా గృహాలు క్రమబద్ధీకరణ జరిగాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేకుండా గృహ నిర్మాణాలు జరిగాయి. దీనిపై చర్యలకు ఉపక్రమించినా రాజకీయవత్తిళ్ల కారణంగా అధికారులు మౌనం దాల్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వమే అక్రమ భవనాలకు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడంతో మొత్తం అటువంటి భవనాలన్నీ క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి.

  • ఈ వ్యవహారంపై టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ప్రేమ్‌కుమార్‌ను వివరణ కోరగా ‘ప్రభుత్వం రెండు రోజుల కిందట బీపీఎస్‌ జీవో విడుదల చేసింది. దీన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్తాం. అక్రమ భవననిర్మాణదారులకు స్కీమ్‌ ఉపయోగాలు తెలిపి వారితో వెబ్‌సైట్‌లో నమోదు చేయిస్తామ’ని తెలిపారు.

Updated Date - Nov 14 , 2025 | 11:51 PM