parlment tdp meeting :నిస్వార్థపరులకే పార్టీలో సముచిత స్థానం
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:39 PM
Tdp District Parliament plenary session టీడీపీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యులతో కలిసి జిల్లా పార్లమెంట్ విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించారు.
మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యులతో కలిసి జిల్లా పార్లమెంట్ విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమష్టిగా ప్రతిఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేసి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీలో కష్టపడిన వారికి సముచిత స్థానం లభిస్తుందని స్పష్టం చేశారు. ‘వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను, యువకులను చాలా ఇబ్బందులకు గురిచేశారు. అయినా అధైర్యపడకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపునకు కీలకభూమిక పోషించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తూ సుపరిపాలన అందిస్తున్నామ’ని తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణుల నుంచి పలు వినతులను మంత్రులు స్వీకరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.