Foundation Schools : ఒక విద్యార్థి.. ఒక గురువు
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:22 AM
One student one teacher ఫౌండేషన్ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చాలా పాఠశాలలు ఒకరిద్దరు విద్యార్థులతోనే నడుస్తున్నాయి. వీరికి బోధించేందుకు ఓ టీచర్‌తో పాటు ఒక వంట మనిషి, ఒక ఆయా పనిచేయాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, అదనపు భారం పడుతున్నా.. వాటిని మూసివేయకూడదనే ఉద్దేశంతో ఫౌండేషను స్కూళ్లను ప్రభుత్వం నడిపిస్తోంది.

ఇదీ ఫౌండేషన్ స్కూళ్లలో పరిస్థితి
కొన్నిచోట్ల ఇద్దరు విద్యార్థులకు ఒక టీచరు
అన్ని సదుపాయాలు ఉన్నా చేరేవారు లేరు
దృష్టిపెట్టని ఉపాధ్యాయులు, అధికారులు
జలుమూరు/కంచిలి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఫౌండేషన్ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చాలా పాఠశాలలు ఒకరిద్దరు విద్యార్థులతోనే నడుస్తున్నాయి. వీరికి బోధించేందుకు ఓ టీచర్‌తో పాటు ఒక వంట మనిషి, ఒక ఆయా పనిచేయాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, అదనపు భారం పడుతున్నా.. వాటిని మూసివేయకూడదనే ఉద్దేశంతో ఫౌండేషను స్కూళ్లను ప్రభుత్వం నడిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలలను 1, 2 తరగతులకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 1, 2 తరగతులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లగా మార్పుచేసింది. దీంతో జలుమూరు మండలంలోని యడ్లవానిపేట, హుస్సేనుపురం, చల్లవానిపేట, కరవంజ, వెలుసోద ప్రాథమిక పాఠశాలలు ఫౌండేషన్ స్కూళ్లగా మారాయి. ప్రస్తుతం హుస్సేనుపురంలో ఒక విద్యార్థి మాత్రమే ఉన్నాడు. ఈ బాలుడికి బోధించేందుకు ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. అలాగే, ఒక వంట మనిషి, ఒక ఆయా కూడా ఇక్కడ పని చేస్తున్నారు. అదే విధంగా యడ్లవానిపేట స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు ఒక టీచర్, వంట మనిషి, ఆయా ఉన్నారు. వెలుసోద ఫౌండేషన్ స్కూల్ ఐదుగురు, కరవంజలో ఏడుగురు, చల్లవానిపేట స్కూల్‌లో 13 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుతున్నారు.
కంచిలి మండలం పెద్దకొజ్జిరియా ఫౌండేషన్ పాఠశాలలో శ్యామలా గౌరవ్ అనే విద్యార్థి ఒకటో తరగతిలో చేరాడు. ఇక్కడ పని చేసేందుకు ఓ ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం నియమించింది. పెద్దకొజ్జిరియా ఉన్నత పాఠశాలలో మూడు నుంచి పది తరగతులకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మూడో తరగతిలో ఒక విద్యార్థి, ఐదో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఒక్క ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించారు. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉండగా, ఏడుగురు ఉపాధ్యాయులు పని చేశారు. ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు మానేశారు. అలాగే, బదిలీలు జరగడంతో ఆరుగురు ఉపాధ్యాయులు ఇతర మండలాలకు వెళ్లిపోయారు. ఒకరిని డిప్యూటేషన్‌పై ఇచ్ఛాపురం పాఠశాలకు పంపించారు. దీంతో ముగ్గురు విద్యార్థులు, ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడితో పాఠశాలను నెట్టుకొస్తున్నారు. ఈ గ్రామంలో 40 నుంచి 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కానీ, వీరంతా జాడుపుడి, సోంపేట, కంచిలి తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వారిని ప్రభుత్వ బడుల్లో చేర్పించే విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాకు ఆ అధికారం లేదు
విద్యార్థులు సంఖ్య తక్కువ ఉందని ఫౌండేషన్ స్కూళ్లను మూసివేసే అధికారం మాకు లేదు. పాఠశాలలను ప్రారంభించడం.. మూసివేయడం అనేది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అధికారుల చేతుల్లో ఏమీ ఉండదు.
- బి.మాధవరావు, మండల విద్యాశాఖ అధికారి, జలుమూరు