Share News

ఒకే వీధి.. రెండు మండలాలు!

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:00 AM

There is no development in Banjirupeta ఎక్కడైనా ఒక గ్రామానికి.. ఒకే మండలం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం ఒకే వీధి.. రెండు మండలాల పరిధిలో ఉండడం గమనార్హం. ఇదీ బంజీరుపేట గ్రామంలో ఓ కాలనీ ప్రత్యేకత. రెండు మండలాల పరిధిలో ఉన్నా.. అభివృద్ధి విషయంలో మాత్రం తమను పట్టించుకున్న నాథులు కరువయ్యారన్నది గ్రామస్థుల ఆవేదన.

ఒకే వీధి.. రెండు మండలాలు!
ఇదే బంజీర్‌పేట గ్రామం

టెక్కలికి ఏడు.. సారవకోటకు 40 కిలోమీటర్ల దూరంలో బంజీరుపేట

కనీసస్థాయిలో అభివృద్ధి శూన్యం

పట్టించుకోని అధికారులు, పాలకులు

సవర బంజీరుపేట, మర్రిపాడు గ్రామాలదీ అదే దుస్థితి

టెక్కలి రూరల్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఒక గ్రామానికి.. ఒకే మండలం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం ఒకే వీధి.. రెండు మండలాల పరిధిలో ఉండడం గమనార్హం. ఇదీ బంజీరుపేట గ్రామంలో ఓ కాలనీ ప్రత్యేకత. రెండు మండలాల పరిధిలో ఉన్నా.. అభివృద్ధి విషయంలో మాత్రం తమను పట్టించుకున్న నాథులు కరువయ్యారన్నది గ్రామస్థుల ఆవేదన.

బంజీరుపేట కాలనీ గ్రామం.. టెక్కలి మండలానికి 7 కిలోమీటర్ల సమీపంలో.. సారవకోట మండలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలో 60 ఇళ్లు ఉండగా.. కాలనీలో 23 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో సగం ఇళ్లు సారవకోట మండలం కూర్మనాథపురం పంచాయతీలో ఉన్నాయి. కాలనీ వీధిలో 8 ఇళ్లు మాత్రం టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీలో ఉన్నాయి. కొన్నాళ్ల కిందట టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన కొంతమంది సారవకోట మండలంలో బంజీరుపేట కాలనీకి ఆనుకుని ఇళ్లు నిర్మించారు. దీంతో రెండు వీధులు ప్రస్తుతం కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకే గ్రామం.. రెండు మండలాలుగా మారిపోయింది. లింగాలవలస పంచాయతీకి దగ్గరలో ఉన్న బంజీర్‌పేటతో పాటు, సవర బంజీరుపేట, మర్రిపాడు గ్రామాలు సారవకోట మండలంలో ఉన్నాయి. దీంతో ఈ గ్రామస్థులంతా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. సచివాలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలోని కూర్మనాథపురంలో ఉండడంతో ఏదైనా అవసరంపై కార్యాలయానికి వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. రెండిటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిందని బంజీరుపేట కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. తాగునీరు, సాగునీరు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. రెండు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నిధుల మంజూరు విషయంలో శ్రద్ధ చూపడం లేదని చెబుతున్నారు. ఫలితంగా తమ కాలనీ అభివృద్ధి దూరమవుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. కాస్త దగ్గరలో ఉన్న టెక్కలి మండలంలో తమ గ్రామాలు విలీనం చేయాలని బంజీర్‌పేటతోపాటు, సవర బంజీరుపేట, మర్రిపాడు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

టెక్కలి మండలంలో కలపాలి

సారవకోట మండలంలో మేము ఉన్నాం. మా పక్క ఇంటివారు టెక్కలి మండలం పరిధిలో ఉన్నారు. మండల కార్యాలయంలో పనుల కోసం సారవకోట వెళ్లాలంటే 40 కిలోమీటర్ల దూరం కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిధులు కూడా మంజూరు చేయక.. అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. మా గ్రామాన్ని టెక్కలి మండలంలో కలిపితే మంచిది.

- ఎస్‌.తాతారావు, బంజీర్‌పేట

ఇబ్బందులు పడుతున్నాం

మేము టెక్కలి మండలానికి 7 కిలోమీటర్లు, సారవకోట మండలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కనీస అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల టెక్కలి మండలంలో మా గ్రామాన్ని కలపాలని అధికారులకు వినతిపత్రం అందజేశాం.

సావుకారి ధర్మారావు, బంజీర్‌పేట కోలనీ

అభివృద్ధి లేదు

మా గ్రామంలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. సారవకోట మండలానికి దూరంగా ఉండడం వల్ల మా గ్రామంవైపు అధికారులు వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు జరగడం లేదు.

ఆర్‌.ఈశ్వరావు, బంజీర్‌పేట

Updated Date - Dec 10 , 2025 | 12:00 AM