నకిలీ నోట్ల వ్యవహారంలో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:53 AM
నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి పుస్తకాల బ్యాగును చేతిలో పెట్టి ఒడిశాకు చెందిన లొట్ల లచ్చుమయ్య అనే వ్యక్తిని మోసం చేసిన పలాసకు చెందిన సునీల్‌ను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు.
- మరొకరి కోసం పోలీసుల గాలింపు
- రూ.4.50 లక్షలు స్వాధీనం
పలాస, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి పుస్తకాల బ్యాగును చేతిలో పెట్టి ఒడిశాకు చెందిన లొట్ల లచ్చుమయ్య అనే వ్యక్తిని మోసం చేసిన పలాసకు చెందిన సునీల్‌ను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఈ వివరాలను ఆదివారం ఆయన విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన లచ్చుమయ్యకు ఈ నెల 8న పలాసకు చెందిన సునీల్‌తో పాటు ఒడిశాకు చెందిన మరొక వ్యక్తితో వాట్సాప్ ద్వారా పరిచయమైంది. రూ.10 లక్షలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే రూ.50 లక్షల విలువైన నకిలీ కరెన్సీ ఇస్తామని లచ్చుమయ్యకు సునీల్, ఒడిశా వ్యక్తి చెప్పారు. ఈ మేరకు లచ్చుమయ్య రూ.10 లక్షలు నగదు తీసుకొని కారులో రాగా, మొగిలిపాడు జాతీయ రహదారి వద్ద సునీల్, ఒడిశా వ్యక్తి బైక్‌పై బ్యాగుతో వచ్చి లచ్చుమయ్య నుంచి నగదు తీసుకున్నారు. అనంతరం నకిలీ కరెన్సీ బ్యాగులో ఉందని చెప్పి దాన్ని ఆయనకు అందించి వెళ్లిపోయారు. దీంతో ఆ బ్యాగును లచ్చుమయ్య కారులో పెట్టాడు. కొంత సేపటి తరువాత లచ్చుమయ్య బ్యాగును తెరిచి చూడగా నకిలీ కరెన్సీకి బదులు పుస్తకాలు ఉండడంతో తాను మోసపోయానని గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టడంతో పలాస జాతీయ రహదారి అమరావతి దాబా వద్ద సునీల్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయన్ను ప్రశ్నించడంతో అసలు విషయం బయట పెట్టాడు. ఆయన నుంచి రూ.4.50 లక్షల నగదు రికవరీ చేశారు. రెండో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సునీల్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.