గంజాయితో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:43 AM
ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడగా, మరొక వ్యక్తి పరారయ్యాడు.
- మరొకరు పరార్
- 28 కేజీల సరుకు స్వాధీనం
ఇచ్ఛాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. 28కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వివరాలను స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహన్ బ్లాక్ బాపూజీ నగర్ వీధికి చెందిన అమిలైసా పాణి, గంజాయి వ్యాపారి భీరజ్ అలియాస్ ధరమ్ బీర్‌నాయక్ కలిసి ఒడిశా కొండ ప్రాంతంలో 28 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని రైలులో తరలించి దాదర్ రైల్వే స్టేషన్‌లో ముంబాయిలోని కోపర్ కర్నే ప్రాంతానికి చెందిన ఇంగెలే రామేశ్వర్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. భీరజ్ టికెట్ తీయడానికి వెళ్లగా, అమిలైసా పాణి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు పట్టుకుని విచారించారు. ఆయన బ్యాగును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, భీరజ్ మాత్రం పరారయ్యాడు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు పాల్గొన్నారు.