Share News

Bahuda river: అయ్యో.. బాహుదా!

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:12 PM

Bahuda river: ఎక్కడైనా నది పక్కనే ఉంటే సాగు,తాగునీటికి చింత ఉండదు. కానీ, ఇచ్ఛాపురం పట్టణ, పరిసర గ్రామాల ప్రజల పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

Bahuda river: అయ్యో.. బాహుదా!
నీరు లేక ఎడారిలా మారిన బాహుదా నది

- నిర్వహణ లేక నీరసించిన నది

-ఒడిశా కనికరిస్తేనే దిగువ ప్రాంతానికి నీరు

- ఆవేదనలో ఇచ్ఛాపురం రైతాంగం

ఇచ్ఛాపురం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా నది పక్కనే ఉంటే సాగు,తాగునీటికి చింత ఉండదు. కానీ, ఇచ్ఛాపురం పట్టణ, పరిసర గ్రామాల ప్రజల పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. చెంతనే బాహుదా నది రూపంలో నీటివనరు ఉన్నా ఫలితం లేకపోతోంది. సాధారణ రోజుల్లో నదిలో చుక్కనీరు కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే వరదల సమయంలోనే నది అన్నట్టు కనిపిస్తుంది. మిగతా రోజుల్లో నదితో నిష్ఫలమే. గతంలో లక్షలాది మందికి దాహం తీర్చుతూ..వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేది బాహుదా నది. ఇప్పుడు మాత్రం కేవలం ఒడిశా ప్రయోజనాలకే అన్నట్టు మారిపోయింది. వారి దాహం, సాగునీటి అవసరాలు తీరాక దిగువ ప్రాంతానికి నీరు విడిచిపెడుతుండడం ఇచ్ఛాపురం ప్రాంత ప్రజలకు శాపంగా మారింది.


సాగు, తాగునీటి వనరుగా..

ఒడిశాలో పుట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది బాహుదా. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇచ్ఛాపురం పట్టణంతో పాటు మరో 30 గ్రామాలకు సాగునీటి ప్రధాన ఆధారం కూడా బాహుదే. కానీ, నదికి సంబంధించి సరైన నిర్వహణ లేదు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, గత పాలకుల తప్పిదాలు, నదిలో నీటి ప్రవాహం మార్పులు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్నింటికీ మించి ఒడిశా ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు కింద ప్రాంతంగా ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. లెక్కలేనన్ని ఎత్తిపోతల పథకాలు ఒడిశా ప్రాంతాల్లో నిర్మించారు. వాటన్నింటినీ దాటుకొని కింది ప్రాంతాలకు నీరు రావడం గగనంగా మారింది. ఇటీవల ఇచ్ఛాపురం పట్టణానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తడంతో నీరు విడిచిపెట్టాలని ఒడిశా అధికారులను కోరారు. వారు నిరాకరించడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్కడి అధికారులతో మాట్లాడి నీరు విడిచిపెట్టేలా చేశారు.


ఖరీఫ్‌ సమీపిస్తున్నా...

ప్రస్తుతం ఖరీఫ్‌ సమీపిస్తోంది. కానీ, నదికి సంబంధించి ఎటువంటి నిర్వహణ పనులు ప్రారంభం కాలేదు. ఒడిశా భూభాగంలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతున్నారు. కానీ మన భూభాగంలో 18 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 ఓపెన్‌ హెడ్‌ చానళ్లను కనీసం మరమ్మతు చేయలేకపోతున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సాగునీటి వనరుల విషయంలో కదలిక వచ్చింది. వాటిని వీలైనంత త్వరగా బాగుచేయాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే గతం మాదిరిగా పంట కాలువలు, గ్రోయిన్లు, రాతికట్టడాలకు రైతులే సొంతగా నిధులు వేసుకొని బాగుచేసుకోవాల్సి ఉంటుంది. బాహుదా ఆయకట్టు పరిధిలో 750 చెరువులు ఉన్నాయి. వాటికి నది నీటిని మళ్లించాలి. వరద పోటు తీరం, పంట పొలాలపై పడకుండా చిన్నపాటి కరకట్టలు నిర్మించాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వం దృష్టి పెట్టాలి

బాహుదా నదిపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి. నిర్వహణ లేక నది నీరసించిపోయింది. పూర్తిగా స్వరూపమే మారిపోయింది. ఒక్క వర్షాకాలంలో మాత్రమే నదిలో నీరు కనిపిస్తుంది తప్ప.. మిగతా రోజుల్లో ఒడిశా దయాదక్షణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి బాహుదా నిర్వహణపై ఫోకస్‌ చేయాలి. బెల్లుపడ, ఈదుపురం, పూర్ణాటకం, కేశుపురం, బూర్జుపాడు, డొంకూరు, సన్యాసిపుట్టుగ ఇలా చాలా గ్రామాలు రైతాంగం అంతా బాహుదానది నీటిపై ఆదారపడి ఉంది.

- ఆశి జీవులు రెడ్డి, బెల్లుపడ రైతు, ఇచ్ఛాపురం


చాలా బాధేస్తోంది..

నదిని చూస్తే బాధేస్తోంది. పక్కనే నది ఉన్నా పొలాలకు సాగునీరు అందని దుస్థితి. ఒడిశా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతోంది. కానీ మన భూభాగంలో ఉన్న చిన్నపాటి ప్రాజెక్టులు సైతం మరమ్మతులు చేయలేకపోతున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా ఆధారపడే బాహుదా నదిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

-కాళ్ల ధర్మారావు, రైతు, గొల్లవీధి, ఇచ్ఛాపురం.

Updated Date - Jun 03 , 2025 | 11:12 PM