Offshore reservoir : రెండేళ్లలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తి
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:05 AM
Offshore reservoir : ‘ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఏడాదికి ఒక ఎంఎల్‌డీ నీరు రైతులకు అందిస్తాం. రానున్న 70 రోజుల్లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాలి.’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

- 70 రోజుల్లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగాలి
- మంత్రి అచ్చెన్నాయుడు
పలాస, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఏడాదికి ఒక ఎంఎల్‌డీ నీరు రైతులకు అందిస్తాం. రానున్న 70 రోజుల్లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాలి.’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రధాన గట్టుపై రైతులు, నిర్వాసితులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వంశధార ఎస్‌ఈ పివి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేసే విధంగా ప్రజలు సహకారం అందించాలని కోరారు. పనులకు ఇబ్బందులు కలిగించకుండా ఉంటే అనుకున్న టార్గెట్‌కు చేరుకోగలమని భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు సమస్యలు ఉన్నట్టు గుర్తించామని, మొత్తం 14 ఎకరాల భూమికి పరిహారం విషయం, ఆర్ అండ్‌ఆర్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న పనులపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై 15 రోజుల్లో పరిష్కారం చూపాలని ఆదేశించారు. 2008లో రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిన తరువాత వచ్చిన టీడీపీయేతర ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యామసుందరశివాజి ఎంతో పట్టుదలతో ప్రభుత్వంపై పోరాడి రూ.500 కోట్లు మంజూరు చేయించారని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. దీనిపై కనీసం ఒక్కసారి కూడా మాట్లాడే సందర్భాలు లేవని గుర్తు చేశారు. తాము కేవలం 8 నెలల్లో మొదటి విడతగా రూ.30కోట్లు, రెండు విడతగా రూ.80 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో వంశధార రిజర్వాయరు పనులు జూన్ నాటికి పూర్తి చేసేందుకు సంకల్పించామన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అంతా గుర్తించాలని అన్నారు.
ఐదేళ్లూ పట్టించుకోలేదు:
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా పని చేసిన ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆఫ్‌షోర్ కోసం పట్టించుకున్న పాపాన లేదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆయన నిర్లక్ష్యం కారణంగా వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు విడుదల చేయడంతో పాటు పాత కాంట్రాక్టర్ల బకాయిలు కూడా చెల్లించామని గుర్తు చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రజల కల అని, దీన్ని సకాలంలో నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్, నార్త్‌కోస్ట్ సీఈ రామ్‌గోపాల్, పలాస, టెక్కలి ఆర్డీవోలు జి.వెంకటేష్, కృష్ణమూర్తి, ఈఈ శేఖర్‌బాబు, తహసీల్దార్లు కళ్యాణచక్రవర్తి, బి.పాపారావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్, ఎం.నరేంద్ర, శాసనపురి మురళీకృష్ణ, సప్ప నవీన్, జోగ మల్లి పాల్గొన్నారు.