అధికారుల తప్పిదం.. గిరిజనులకు శాపం
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:07 AM
మండల కేంద్రం కొత్తూరు సమీపంలో మూడేళ్ల కిందట ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన వనధన్ వికాస కేంద్రం (వీడీవీకే) ప్రస్తుతం మూలకు చేరింది.
- కొత్తూరులో తెరుచుకోని వన్‌ధన్ వికాస కేంద్రం
- మరుగునపడిన జీడిపిక్కల ప్రోసెస్ యూనిట్
- ముళ్లపొదల మధ్య భవనం
- ఆదాయానికి దూరమవుతున్న ఆదివాసీలు
-యూనిట్ బాగుందంటూ ఫొటోలతో అధికారుల మాయాజాలం
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి, వారు పండించే అటవీ ఉత్పత్తులకు మార్కెట్‌లో విలువను పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వనధన్ వికాస కేంద్రాలను (వీడీవీకే) ప్రవేశపెట్టింది. అయితే, కొత్తూరు మండలంలో వనధన్ వికాస కేంద్రం ఏర్పాటు విషయంలో అధికారులు చేసిన తప్పిదం గిరిజనులకు శాపంగా మారింది. గిరిజనులకు దగ్గరగా నెలకొల్పాల్సిన కేంద్రాన్ని వారికి సుదూరంలో ఏర్పాటు చేశారు. యంత్రాలు కోనుగోలులో కూడా అవకతవకలకు పాల్పడ్డారు. అంతదూరం వెళ్లడానికి గిరిజనులు ఇష్టపడకపోవడంతో వీడీవీకే తెరుచుకోవడం లేదు. ఫలితంగా ఆ కేంద్రంలోని జీడిపిక్కల ప్రోసెస్ యూనిట్ మరుగున పడింది. పైగా గిరిజనేతరులను సభ్యులుగా చేర్చడంతో అసలైన ఆదివాసీలు నష్టపోతున్నారు. అధికారులు మాత్రం యూనిట్‌ను సక్రమంగా నడుపుతున్నట్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి మాయాజాలం చేస్తున్నారు.
కొత్తూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం కొత్తూరు సమీపంలో మూడేళ్ల కిందట ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన వనధన్ వికాస కేంద్రం (వీడీవీకే) ప్రస్తుతం మూలకు చేరింది. ఏడాదిగా వీడీవీకే తెరుచుకోవడం లేదు. దీంతో ఈ కేంద్రంలో నెలకొల్పిన జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్ పని చేయకపోవడంతో గిరిజనులు ఆదాయానికి దూరమవుతున్నారు. వాస్తవంగా ఈ కేంద్రాన్ని గొట్టిపల్లి పంచాయతీ పుల్లగూడలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, వెలుగు అధికారులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా కొత్తూరు సమీపంలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో గొట్లిపల్లి వీడీవీకే, ఇరపాడుగూడ వీడీవీకేకు చెందిన 300 మంది మహిళా సంఘాల సభ్యులను చేర్చి జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. కొత్తూరులో యూనిట్ పెట్టడం వలన కొత్తూరు వీడీవీకే సభ్యులను కూడా ఉందులో భాగస్వాములను చేశారు. అయితే, కొత్తూరు వీడీవీకేలో గిరిజనేతరులు ఎక్కువగా ఉన్నారని అప్పట్లో ఆదివాసీలు వ్యతిరేకించారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. యంత్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అప్పట్లో రూ.15లక్షల నిధులు మంజూరు చేసింది. కానీ, అధికారులు మాత్రం కొత్త యంత్రాలు కొనుగోలు చేయకుండా సీతంపేటలో ఉన్న పాతవి తీసుకువచ్చి అమర్చారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ఓ అధికారిపై అప్పటి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు యంత్రాల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తేల్చారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను బదిలీ చేసి చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్ సక్రమంగా నడవడం లేదు. నిత్యం యూనిట్ సిబ్బంది, అధికారులు మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో యూనిట్ మూతపడే దశకు చేరింది.
జీడిపిక్కల రవాణాకు ఇబ్బందులు..
గొట్లిపల్లి, ఇరపాడుగూడ, లబ్బ తదితర గిరిజన ప్రాంతాలకు కొత్తూరు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి కొత్తూరుకు వెళ్లేందుకు ఎలాంటి బస్సులు లేవు. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలే దిక్కు. అవి కూడా నిత్యం తిరగవు. దీనివల్ల కొత్తూరులోని వనధన్ వికాస కేంద్రానికి జీడిపిక్కలను తీసుకెళ్లేందుకు గిరిజనులు తీవ్ర వ్యయప్రయాసలకు గురయ్యేవారు. రవాణా చార్జీల కింద రూ.100 నుంచి రూ.150 చెల్లించాల్సి వచ్చేది. దీంతో లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుండడంతో ప్రోసెసింగ్ యూనిట్‌కు జీడిపిక్కలను తీసుకెళ్లడం లేదని గిరిజనులు చెబుతున్నారు. అదే యూనిట్‌ను తమకు దగ్గరగా ఉన్న పుల్లగూడలో నెలకొల్పి ఉంటే ఎంతో ఉపయోగపడేదని అంటున్నారు. అధికారులు చేసిన తప్పిదం తమకు శాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కొత్తూరులోని వనధన్ వికాస కేంద్రం తలుపులు తెరుచుకోకపోవడంతో ఈ ఏడాది గిరిజనులు జీడిపిక్కలను తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించి నష్టపోయారు. ప్రస్తుతం వనధన్ వికాస కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు అల్లుకొని అడవిని తలపిస్తుంది. లక్షలాది రూపాయల విలువైన జీడి ప్రోసెసింగ్ యంత్రాలు మూలకు చేరాయి. అధికారులు మాత్రం యూనిట్‌ను ఎల్లవేళలా తెరుస్తున్నట్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ఉన్నతాధికారలను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై సీతంపేట వెలుగు డీపీఎం ఆర్‌వీ రమణను వివరణ కోరగా ‘జీడిపప్పుకు ఆర్డర్ వస్తే కొత్తూరులోని ప్రోసెసింగ్ యూనిట్‌లో తయారు చేసి అందిస్తాం. సమస్యలు ఉంటే పరిష్కారానికి నావంతుగా కృషి చేస్తా.’అని తెలిపారు.