ఒడిశా టు బళ్లారి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:38 PM
Ganjai transports ఒడిశా రాష్ట్రం పుస్తపూర్ నుంచి కర్నాటక రాష్ట్రం బళ్లారికి అక్రమంగా తరలిస్తున్న 30కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.
30 కేజీల గంజాయి అక్రమ రవాణా
ఇద్దరి అరెస్టు
ఇచ్ఛాపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం పుస్తపూర్ నుంచి కర్నాటక రాష్ట్రం బళ్లారికి అక్రమంగా తరలిస్తున్న 30కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇచ్ఛాపురంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంబ్రేష్ తమ్ముడు రాము గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అంబ్రేష్ తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాముకు చెప్పగా, ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తే ప్రతీసారి రూ.10వేలు ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంబ్రేష్ ఒప్పుకున్నాడు. వెంటనే రాము తనకు గంజాయి వ్యాపారంలో సాయంగా ఉన్న రాచకొండ వెంకటసాయిని తోడు ఇచ్చి బళ్లారి నుంచి అంబ్రేష్‌ను రైలులో ఒడిశా పంపించాడు. ఒడిశాలో ఖనుచరణ్ పండా వద్ద గంజాయి కొనుగోలు చేసుకొని బస్సులో ఇచ్ఛాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజాయి మూటలతో అంబ్రేష్, వెంకటసాయి కలిసి నడుచుకుంటూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ అనుమానస్పదంగా కనిపించటంతో టౌన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.రవివర్మ తనిఖీ చేశారు. వారివద్ద 30 కేజీల గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఆ గంజాయిని సీజ్ చేసి, వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ చిన్నమనాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రవివర్మ పాల్గొన్నారు.