Share News

మహేంద్ర తనయ జలాలకు ఒడిశా అడ్డుకట్ట

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:15 AM

మహేంద్ర తనయ నదీ జలాలు ఆంధ్రాకు రాకుండా ఒడిశా అధికారులు అడ్డుకుంటున్నారు.

మహేంద్ర తనయ జలాలకు ఒడిశా అడ్డుకట్ట
పర్లాకిమిడి స్నేహవారథి వద్ద మహేంద్ర తనయ నదీ జలాలు ఆంధ్రాలోకి రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యం

-స్నేహవారథి వద్ద ఇసుక బస్తాలు వేస్తున్న వైనం

- దిగువ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు

పాతపట్నం, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి): మహేంద్ర తనయ నదీ జలాలు ఆంధ్రాకు రాకుండా ఒడిశా అధికారులు అడ్డుకుంటున్నారు. నదీ జలాలు దిగువకు వెళ్లనీయకుండా పర్లాకిమిడిలోని స్నేహవారథి వద్ద ఇసుక బస్తాలను అడ్డుగా వేసి ఒడిశాలో నీటి నిల్వలు పెంచుకుంటుంటారు. ప్రతిఏటా వర్షాకాలం ముగిసిన వెంటనే డిసెంబరులో ఈ చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ ఏడాది నది దిగువనున్న పాతపట్నం, బూరగాం, కాగువాడ కొరసవాడ, సీది, తామర, తీమర, పాశిగంగుపేట తదితర గ్రామాల రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మహేంద్ర తనయ ఎగువభాగంలో ఒడిశా రబ్బర్‌ డ్యామ్‌ను నిర్మించి నదీ జలాలను వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. మిగులు జలాలు కూడా కిందకు రాకుండా తాజాగా స్నేహవారథి వద్ద ఇసుక బస్తాలను అడ్డుగా వేసింది. దీంతో మహేంద్ర తనయ నదీ జలాల ప్రయోజనాలు ఆంధ్రాకు శూన్యంగానే మిగిలాయని ఈ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో వరదలు వస్తే మాత్రం నీటిని ఆంధ్రాకు వదిలేస్తున్నారని అంటున్నారు. జిల్లా పాలకులు, అధికారులు చొరవచూపి మహేంద్ర తనయ జలాలు దిగువ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:15 AM