ఎన్టీఆర్ మునిసిపల్ పాఠశాలను దత్తత తీసుకుంటా
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:52 PM
school Will be fully developed ‘శ్రీకాకుళంలో ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన ఎన్టీఆర్ మునిసిపల్ పాఠశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ పాఠశాలను దత్తత తీసుకుంటా. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా’నని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళంలో ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన ఎన్టీఆర్ మునిసిపల్ పాఠశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ పాఠశాలను దత్తత తీసుకుంటా. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా’నని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మునిసిపల్ పాఠశాలలో ఎంపీ ల్యాడ్స్ రూ.50లక్షలతో నిర్మిస్తున్న తిలక్ హాల్ పనులను ఆయన పరిశీలించారు. హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా సమకూర్చి, త్వరలోనే దానిని పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. ముఖాముఖిలో భాగంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి.. సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చక్కని ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను, రాష్ట్రస్థాయిలో క్రీడలకు ఎంపికైన వారిని ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ప్లాస్టిక్ రహిత పాఠశాలగా ఉంచేందుకు అందరు సహకరించాలని కోరారు. ‘విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ మరింత ఉన్నతంగా నడుస్తోంది. యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు, ఇలా అన్నింటిలో తన మార్కు చూపిస్తున్నార’ని కేంద్రమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మునిసిపల్ పాఠశాలలోనే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కలిశారు. కొద్దిసేపు పలు విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.