Share News

NTR Jalasiri: ఎన్టీఆర్‌ జలసిరి.. రైతులకు అండ

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:12 AM

Irrigation scheme.. Agricultural support ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని పునరుద్ధరించనుంది. రైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పంపుసెట్లు అందుబాటులోకి తేనుంది. పొలంలో నీరు ఉంటే రైతులు సిరులు పండించవచ్చని అంటారు.

NTR Jalasiri: ఎన్టీఆర్‌ జలసిరి.. రైతులకు అండ

  • జిల్లాకు రూ.50 కోట్లు కేటాయింపు

  • త్వరలో మార్గదర్శకాలు జారీ.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

  • వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం

  • ఇచ్ఛాపురం, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని పునరుద్ధరించనుంది. రైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పంపుసెట్లు అందుబాటులోకి తేనుంది. పొలంలో నీరు ఉంటే రైతులు సిరులు పండించవచ్చని అంటారు. జిల్లాలో మెట్ట ప్రాంతమే ఎక్కువ. బోర్లే సాగు నీటికి ఆధారం. కానీ బోర్లు కట్టాలంటే రైతుకు తలకు మించిన భారం. అందుకే ఎక్కువమంది రైతులు ప్రభుత్వ రాయితీ కోసం ఎదురు చూస్తుంటారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందిస్తూ వచ్చింది. సూక్ష్మసేద్యం పరికరాలు, పనిముట్లను అందించింది. ఆ స్ఫూర్తితోనే ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టి సమర్థంగా అమలుచేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం నీరుగారి పోయింది. టీడీపీ ఐదేళ్లలో 2,639 మందికి జలసిరి పథకం ద్వారా బోర్లు తవ్విస్తే వైసీపీ ఐదేళ్లలో కేవలం 246 బోర్లను తవ్విందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

  • పీఎం కుసుమ్‌తో అనుసంధానం..

  • కూటమి ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ఎన్టీఆర్‌ జలసిరికి భారీగా నిధులు కేటాయించింది. జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం మార్గదర్శకాలను తయారుచేసే పనిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కుసుమ్‌ పథకంతో అనుసంధానించి అమలు చేసేందుకు నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌పై కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతాన్ని రాయితీ కింద అందించనుంది. లబ్ధిదారుడు కేవలం 30 శాతం భరించాలి. ఇందులో కూడా బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే సమయంలో సూర్యఘర్‌ పథకం కింద సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లను సైతం ప్రభుత్వం అమర్చనుంది.

  • 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని ప్రారంభించింది. ఉచితంగా బోరు తవ్వించి.. రాయితీపై పైపులు, ఇతర సామగ్రి అందించడమే ఈ పథకం ఉద్దేశం. అప్పట్లో 2,639 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అందరికీ బోర్లు ఉచితంగా తవ్వించింది. 1969 మందికి సోలార్‌ కనెక్షన్లు అందించింది. మిగతావారికి విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చింది.

  • వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని వైఎస్సార్‌ జలకళ పథకంగా మార్చింది. 3,600 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ 246 మందికి మాత్రమే అమలు వేశారు. ఈ పథకం విషయంలో ఐదేళ్ల పాటు ఆర్భాటమే నడిచింది. రైతులు పడిన బాధలు వర్ణనాతీతం.

  • ఎంతో ప్రాధాన్యం..

  • ప్రభుత్వం జలసిరికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. వార్షిక బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు, సాగునీటి ఆధారం లేని భూములకు జలసిరి పథకం కొండంత అండ.

    - సుధాకరరావు, డ్వామా పీడీ

Updated Date - Jul 22 , 2025 | 12:12 AM