Baby kits: ఎన్టీఆర్ బేబీకిట్లు వస్తున్నాయ్
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:55 PM
Healthcare for Mothers and Babies బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా టీడీపీ ప్రభుత్వ హయాంలో గర్భిణులకు ప్రోత్సాహక నిధులు అందజేసేవారు.
త్వరలో పంపిణీకి ఏర్పాట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరగనున్న ప్రసవాలు
టెక్కలి రూరల్, జూలై 10(ఆంధ్రజ్యోతి): బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా టీడీపీ ప్రభుత్వ హయాంలో గర్భిణులకు ప్రోత్సాహక నిధులు అందజేసేవారు. అలాగే చిన్నారుల సంరక్షణకుగానూ 11 రకాల వస్తువులతో బేబీకిట్లను పంపిణీ చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 నుంచి బాలింతలకు బేబీకిట్ల పంపిణీని నిలిపేసింది. దీంతో బాలింతలు మార్కెట్‌లో వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణులకు బేబీకిట్లను పంపిణీ చేసేలా చర్యలు చేపడుతోంది. జిల్లాలో ప్రస్తుతం 9,206 మంది గర్భిణులు ఉన్నారు. వారందరికీ త్వరలో బేబీకిట్లను అందజేయనున్నారు. శిశువు నిద్రపోయేందుకు బెడ్, దోమతెరతోపాటు బాలింతలు చేతులు శుభ్రం చేసుకునేందుకు ద్రవణం, సబ్బు అందజేయనున్నారు. వీటితోపాటు పౌడర్, న్యాప్‌కిన్, రెండు తువ్వాళ్లు, చిన్నబొమ్మ తదితర 11 రకాల వస్తువులను ఇవ్వనున్నారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.1,410 వరకు ఉంటుంది. ఇప్పటికే డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జీజీహెచ్‌లకు రెండేళ్లపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరాకు టెండర్లు పిలిచారు. ఈ బాధ్యతను ఏపీ వైద్యసేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. బేబీకిట్లు పంపిణీ చేస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.