సీదిరికి మరోసారి నోటీసులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:52 PM
మాజీ మంత్రి, వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
నేడు విచారణకు హాజరుకావాలన్న పోలీసులు
పలాస, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నకిలీ మద్యం, అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన చేసిన ఆరోపణలకు గాను విచారణకు హాజరుకావాలని కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి ఆదివారం సీదిరికి తన నివాసంలో నోటీసులు అందించారు. గత నెలలో కాశీబుగ్గ శ్రీనివాసలాడ్జి జంక్షన్ వద్ద నకిలీ మద్యం విషయంపై మహిళలతో కలసి వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అక్కడకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌తో వైసీపీ కార్యకర్త ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించారని అప్పట్లో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి సీదిరి చేసిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం కాశీబుగ్గ పోలీస్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని ఎస్‌ఐ కోరారు. ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో శనివారం ఆయన్ను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఏడు గంటల పాటు పోలీసులు విచారించిన విషయం విధితమే. ఇప్పుడు రెండోమారు నోటీసులు జారీచేశారు.