Share News

ఇసుకాసురులకు నోటీసులు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:15 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా జరిగిన ఇసుక తవ్వకాలపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ఇసుకాసురులకు నోటీసులు

- అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు

- 82 నోటీసులు జారీ

- అపరాధ రుసుం చెల్లించాల్సిందేనంటున్న గనులశాఖ

శ్రీకాకుళం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా జరిగిన ఇసుక తవ్వకాలపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించి ఇసుకాసురులకు 82 నోటీసులు జారీచేసింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు కట్టబెట్టేసింది. మే 2021 నుంచి డిసెంబరు 2023 వరకు ఇసుక తరలించుకునేందుకు జేపీ సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టింది. ఆ తర్వాత జూన్‌ 2024 వరకు ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు కూడా కాంట్రాక్టు ఇచ్చింది. అయితే, ఇచ్చిన అనుమతులు కంటే ఎక్కువగా ఆ సంస్థలు ఇసుక తవ్వకాలు చేపట్టి దోచుకున్నాయి. ఆ సంస్థలకు తోడు అప్పటి వైసీపీ కీలక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సప‘రేటు’గా ఇసుక తవ్వుకుని అమ్ముకున్నారు. అనుమతులు ఉన్న వంశధార, నాగావళి రీచ్‌లతో పాటు అనుమతిలేని చోట కూడా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుకుపోయి రూ.కోట్లు సంపాదించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారంతా తట్టాబుట్టా సర్దుకున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అక్రమార్కులను విడిచిపెట్టలేదు. జిల్లాలో వంశధార, నాగావళి నదులు, ఇసుక రీచ్‌లు, అనధికార ర్యాంపుల నుంచి ఇసుకను ఏవిధంగా తరలించారు.. ఎలా మాయం చేశారు.. ఏమేర నష్టం వాటిల్లిందన్నదీ విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ శాక్‌ (ఏపీ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌)కు ఆదేశించింది. దీంతో ఏపీ శాక్‌ విచారణ చేపట్టి.. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధికంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగిన ట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ఆధారంగా గనులశాఖ చర్యలకు ఉపక్రమించింది. గతంలో జిల్లాలో తవ్వకాలు చేపట్టిన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, కోట్లాది రూపాయల అపరాధ రుసుం చెల్లించాల్సిందేనని నోటీసుల్లో పేర్కొంది. అయితే, సంస్థల పేరిట మాత్రమే నోటీసులు ఉండటంతో.. అప్పటి ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నాయకులు ఇప్పటికి మనం సేఫ్‌ అన్నట్లుగా భావిస్తున్నట్లు సమాచారం.

- వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఓ వ్యక్తి ఆధారాలతో సహా ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 6,500 హెక్టార్లలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగ్గా.. శ్రీకాకుళం జిల్లాలో 489.850 హెక్టార్లలో తవ్వుకుపోయినట్లు అఫిడవిట్‌లో ఆ వ్యక్తి చేర్చాడు. ఇందుకు సంబంధించి 2021-24 మధ్య కాలంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు ‘గూగుల్‌ ఎర్త్‌ప్రో’ చిత్రాలను కూడా సేకరించి సుప్రీం ముందు ఉంచాడు.

Updated Date - Sep 04 , 2025 | 12:15 AM