Share News

ఒక్క అంశమూ చర్చించలే

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:59 PM

Zp meeting జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏ ఒక్క అంశంపైనా చర్చించలేదు. కేవలం పాలకొండ ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్‌ చేశారు.

ఒక్క అంశమూ చర్చించలే
సమావేశం నుంచి వెళ్లిపోతున్న జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జడ్పీటీసీలు

  • పాలకొండ ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని..

  • వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీల డిమాండ్‌

  • జడ్పీ చైర్‌పర్సన్‌తో సహా సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్‌

  • సమస్యల ప్రస్తావన లేకుండానే ముగిసిన కార్యక్రమం

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏ ఒక్క అంశంపైనా చర్చించలేదు. కేవలం పాలకొండ ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్‌ చేశారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ కూడా మద్దతు పలికి వాకౌట్‌ చేశారు. ఫలితంగా సమస్యలపై ప్రస్తావన లేకుండానే సమావేశం ముగిసింది. శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆదివారం ఉదయం 11.30గంటలకు సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. తొలుత మైక్‌ అందుకున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ తన సమస్య గురించి సభలో చెప్పుకున్నారు. తనకు నాలుగురోజుల కిందట పాలకొండ మండల సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం అందిందని.. సమావేశానికి వెళ్తే.. పోలీసులు తనను అక్కడకు రానీయకుండా అడ్డుకున్నారంటూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయకు తెలిపారు. ఆ తర్వాత నుంచి వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇదే సమస్యను ప్రస్తావిస్తూ.. ‘ఎమ్మెల్సీకి ప్రొటోకాల్‌ ఉల్లంఘించడమేంటి?. పాలకొండ ఎంపీడీవోపై చర్యలు తీసుకుంటేనే ఈ సభ జరగనిస్తాం. లేదంటే జరగనీయబోమ’ని మూకుమ్మడిగా సభలో చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రొటోకాల్‌ను ప్రతి ఒక్క అధికారి పాటించాల్సిందేనని.. ఎవరికైనా అనుమానాలు తలెత్తినప్పుడు జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని వెల్లడించారు. జిల్లాపరిషత్‌ సీఈవో శ్రీధర్‌రాజు బదులిస్తూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. కమిషనర్‌కు కూడా పంపామని.. ప్రశ్న అడిగేవారు.. తాను చెప్పేది కూడా వినాలని కోరారు. ‘మీరు చెప్పేది వినేందుకు మేములేము. మేము చెప్పేది మీరు వినాలి. ఎంపీడీవోపై చర్యలు తీసుకోనందుకు సభ నుంచి వెళ్లిపోతున్నామ’ంటూ వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియం వద్దకు వచ్చి.. జడ్పీ సీఈవోను ప్రశ్నించి వెళ్లిపోయారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ కూడా వారికి మద్దతు పలికి వాకౌట్‌ చేస్తున్నామంటూ సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, జిల్లాలో టీడీపీకి చెందిన ఒకేఒక్క జడ్పీటీసీ(హిరమండలం) పొగిరి బుచ్చిబాబు అలా కూర్చున్నారు. కొద్దిసేపు అనంతరం జడ్పీ సీఈవో మాట్లాడుతూ.. చైర్మన్‌తోపాటు, సభ్యులు కూడా లేకపోవడంతో సర్వసభ్య సమావేశంను ముగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధికారులు కూడా వెళ్లిపోయారు. ఏ ఒక్క సమస్యను చర్చించకుండా ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ముగియడం ఇదే తొలిసారి.

Updated Date - Sep 21 , 2025 | 11:59 PM