Share News

‘నీరు’పయోగమే!

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:24 PM

Ro plants problems జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వోప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

‘నీరు’పయోగమే!
సుర్జిణి అంగ్‌వాడీ కేంద్రంలో పనిచేయని ఆర్వోప్లాంట్‌

  • అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేయని ఆర్వోప్లాంట్లు

  • వైసీపీ హయాంలో నాసిరకం యంత్రాలు ఏర్పాటు

  • కొద్దినెలల్లోనే పాడైనా.. కానరాని మరమ్మతులు

  • చిన్నారులకు తప్పని తాగునీటి ఇబ్బందులు

  • మెళియాపుట్టి మండలం పరశురాంపురం అంగన్‌వాడీ కేంద్రంలో 15మంది పిల్లులు ఉన్నారు. రెండేళ్ల కిందట పిల్లలకు మంచినీరు ఇచ్చేందుకుగానూ ఈ కేంద్రంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అది ఆరునెలల్లోనే పాడైపోయింది. అప్పటి నుంచీ మరమ్మతులు చేపట్టలేదు. దీంతో చిన్నారులు ఇంటి నుంచే బాటిళ్లలో తాగునీరు తెచ్చుకుంటున్నారు.

  • మెళియాపుట్టి మండలం సుర్జుణి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 10మంది చిన్నారులు ఉన్నారు. ఈ కేంద్రంలో రెండేళ్ల కిందట ఆర్వోప్లాంట్‌ ఏర్పాటు చేయగా.. కొద్దిరోజుల్లోనే పాడైంది. మరమ్మతులు చేయక మూలకు చేరింది.

  • పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 455 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 72 కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో అధికంగా పాడైపోవడంతో చిన్నారులకు సురక్షిత నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.

  • మెళియాపుట్టి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వోప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కాగా.. నాసిరకం యంత్రాలు కావడంతో ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే చాలా కేంద్రాల్లో ఆర్వోప్లాంట్లు పాడైపోయాయి. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను విశాఖకు చెందిన ఒక ఏజెన్సీకి అప్పగించారు. రెండేళ్లపాటు నిర్వహణ బాధ్యత చూసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. ఆర్వోప్లాంట్లు బిగించిన ఆరునెలలకే చాలాచోట్ల పాడైపోయినా.. ఆ ఏజెన్సీ నిర్వాహకులు మరమ్మతులు చేపట్టలేదు. గత ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వోప్లాంట్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

  • జిల్లాలో ఇధీపరిస్థితి.ః

  • జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 44,862 మంది ఉన్నారు. చిన్నారులకు సురక్షిత నీరు అందించేందుకుగానూ సుమారు 1,500 కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా ఆర్వో ప్లాంట్లు పనిచేయక.. అలంకారప్రాయంగా మిగిలాయి. ఆయా కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులు సురక్షిత నీరు అందని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితమవుతోంది. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకులంలో తాగునీరు కలుషితమై విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత నీరు అందక చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఇళ్ల నుంచి బాటిళ్లతో నీటిని పంపించినా.. అవి చాలక కలుషితనీటిని తాగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్వోప్లాంట్లు మరమ్మతులు చేపట్టి.. సురక్షితనీటిని అందజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అమరావతి వద్ద ప్రస్తావించగా.. ‘ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం కేంద్రాల్లో పిల్లలకు వేడినీళ్లు అందజేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశించామ’ని తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 11:24 PM