Share News

Tomoto : దిగుబడి లేక.. ధర రాక..

ABN , Publish Date - May 20 , 2025 | 12:28 AM

Crop failure.. Farmer crisis టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోంపేట మండలంలో వరి తర్వాత అధికంగా టమాటా పండిస్తారు. బీలకు ఆనుకుని ఉన్న బెంకిలి, జింకిభద్ర, లక్కవరం, పలాసపురం, బారువ, కుత్తమ, మండపల్లి, అమ్మవారిపుట్టుగ తదితర గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో టమాటా సాగు చేశారు.

Tomoto : దిగుబడి లేక.. ధర రాక..

టమాటా పంటకు తెగుళ్ల బెడద

పతనమైన రేట్లతో రైతులకు నష్టాలు

సోంపేట, మే 19(ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోంపేట మండలంలో వరి తర్వాత అధికంగా టమాటా పండిస్తారు. బీలకు ఆనుకుని ఉన్న బెంకిలి, జింకిభద్ర, లక్కవరం, పలాసపురం, బారువ, కుత్తమ, మండపల్లి, అమ్మవారిపుట్టుగ తదితర గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. గతంలో టమాటా పండిస్తే రైతులకు లాభం వచ్చేది. ఈ ఏడాది మాత్రం ధరలు తగ్గడంతో కన్నీరు తెప్పిస్తోంది. గతంలో 27 కిలోల ట్రే రూ.300 నుంచి రూ.500 పలికేది. ప్రస్తుత ధర రూ.100 మాత్రమే ఉందని రైతులు వాపోతున్నారు. ఒకవైపు ధర పతనం కాగా.. మరోవైపు తెగుళ్ల బెడదతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంటున్నారు. గతంలో ఎకరాకు 20టన్నుల వరకు దిగుబడి రాగా.. ప్రస్తుతం రెండు టన్నులు కూడా రావడం లేదని వాపోతున్నారు. టమాటా సాగుకు ఎకరాకు రూ.50వేల వరకు ఖర్చుకాగా.. ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక అప్పులపాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

నష్టమే మిగులుతోంది

టమాటా పండించే రైతులకు గతంలో గిట్టుబాటు ధర లభించేది. ఒక్కో కిలో రూ.15 వరకు విక్రయించేవాళ్లం. ప్రస్తుతం కిలో రూ.3మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులకు నష్టమే మిగులుతోంది. కనీసం పెట్టుబడి కూడా రావడం గగనం అవుతోంది.

- పోకల హేమరాజు, జింకిభద్ర

తగ్గిన దిగుబడి

టమాటా రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఒకవైపు ధరలు తగ్గగా.. మరోవైపు తెగుళ్లు బాధిస్తున్నాయి. ఎకరాకు 20 టన్నులవరకు పండే టమాటా.. ప్రస్తుతం తెగుళ్లబారిన పడి 3 టన్నుల దిగుబడికూడా రావడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగి.. దిగుబడి తగ్గడంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

సించాల పాడీ, బెంకిలి

Updated Date - May 20 , 2025 | 12:28 AM