collecte meeting: సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ABN , Publish Date - May 21 , 2025 | 12:22 AM
Problem Solving Timely Action ‘జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమంలో ఇప్పటివరకు 61,048 ప్రజా ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో 343ఫిర్యాదులు గడువు దాటిపోయాయి. సమస్యల పరిష్కారంలో అలస్యానికి తావులేద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టం చేశారు.
మైనింగ్‌పై రెగ్యులర్ తనిఖీలు చేపట్టాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 20(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమంలో ఇప్పటివరకు 61,048 ప్రజా ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో 343ఫిర్యాదులు గడువు దాటిపోయాయి. సమస్యల పరిష్కారంలో అలస్యానికి తావులేద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఎన్‌ఆర్‌ఈజీఎస్, రెవెన్యూ, ఆరోగ్యం, మైనింగ్, పీఎం సూర్యఘర్, రీసర్వే, కోర్టు కేసులు, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర విషయాలపై మండల అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేయాలని, సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులను డ్వామా అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. 22(ఏ) రికార్డుల స్వచ్ఛీకరణ, వివిధ శాఖలతో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల స్థితిగతులు, వంశధార నదిపై హై లెవెల్‌బ్రిడ్జి, నువ్వలరేవు-మంచినీళ్లపేట రహదారి నిర్మాణాలకు సంబంధించిన అడ్డంకులపై చర్చించారు. నువ్వలరేవు ప్రజలు ఎక్కువ పరిహారం కోరుతున్నారని.. పలాస ఆర్డీవో, వజ్రపుకొత్తూరు తహసీల్దారు. శ్రీకాకుళం ఎస్‌ఈ సంయుక్త సమావేశం నిర్వహించాలని తెలిపారు. లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో యూనివర్శిటీ స్థాపనకు 30- 40 ఎకరాలు, హైడ్రో కార్బన్ కంపెనీ స్థాపనకు 2వేల ఎకరాల భూమిని గుర్తించాలని, ఏపీఐఐసీ భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
మైనింగ్‌పై కలెక్టర్ ఆగ్రహం...
అక్రమ ఇసుక రవాణా, నియంత్రణలేని గ్రానైట్ తవ్వకాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. డివిజనల్, జిల్లా మైనింగ్ కార్యాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రానైట్ క్వారీలలో తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఆరోగ్యం, శానిటేషన్, వ్యాధుల నివారణ, నీటి నమూనాల పరిశీలనపై వైద్యశాఖను ఆదేశించారు. సూర్యఘర్ పథకంలో బ్యాంకులు, కాంట్రాక్టర్ల వద్ద ఉన్న పెండింగ్‌లను క్లియర్ చేయాలని, ఐసిడిఎస్ పథకంలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయుష్ శాఖ, అరసవల్లి ఎండోమెంట్ అధికారి సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీక్షలో ఉప కలెక్టర్ పద్మావతి, డీఆర్వో వేంకటేశ్వరరావు, డీపీవో భారతీ సౌజన్య, సీపీవో ప్రసన్నలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.