Play grounds: మైదానాల్లేవ్.. ఆటలు ఎలా?
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:52 PM
Lack of playgrounds జిల్లాలో క్రీడా మైదానాలు కరువువుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను తయారుచేయాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
మూలకు చేరిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు
టీడీపీ హయాంలో నిర్మాణాలు ప్రారంభం
నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
కూటమి సర్కార్‌పై క్రీడాకారుల ఆశలు
కాశీబుగ్గ, జూలై 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడా మైదానాలు కరువువుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను తయారుచేయాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున పది క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. వ్యాయామ శాలతోపాటు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్‌కు సంబంధించి మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్నిచోట్ల నిర్మాణ పనులు సాగాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణం పూర్తయిన వాటిని సరిగ్గా నిర్వహించలేకపోయింది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను అలానే వదిలేసింది. దీంతో క్రీడాభివృద్ధి లక్ష్యం మరుగున పడిపోయింది.
పలాస నియోజకవర్గంలో క్రీడాకారులకు కొదువ లేదు. ఉద్దానం ప్రాంతంలో కబడ్డీ క్రీడాకారులు అధికం. ఇతర క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారు. అందుకే పలాసలో 2018లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించింది టీడీపీ సర్కారు. 25శాతం నిర్మాణాలను పూర్తిచేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగతా పనులు పూర్తిచేయడంలో విఫలమైంది. దీంతో క్రీడాకారులకు అది శాపంగా మారింది. క్రీడా మైదానం చుట్టూ పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా పోయింది. ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంతో క్రీడాకారులకు ప్రోత్సాహం అందుతుందని భావించారు. కానీ రాజావారి మైదానంలో పునాదులతోనే పనులు నిలిచిపోవడంతో క్రీడాకారులకు నిరాశ తప్పలేదు.
టెక్కలి నియోజకవర్గంలో అప్పట్లో మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయించారు. అప్పట్లో ముగ్గురు శిక్షకులను కూడా నియమించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దీని నిర్వహణను గాలికొదిలేసింది. ప్రస్తుతం ఒక శిక్షకుడు పేఅండ్ ప్లే విధానంలో పనిచేస్తున్నారు. ఒక్క బ్యాడ్మింటన్ కోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. వ్యాయామ శాల మూతపడింది. నీటి సదుపాయం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరూపయోగంగా మారాయి.
పాతపట్నంలో సైతం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహణను గాలికొదిలేసింది. కనీసం కేంద్రం చుట్టూ జంగిల్‌క్లియరెన్స్ కూడా చేపట్టలేదు. దీంతో అటువైపుగా వెళ్లేందుకు కూడా క్రీడాకారులు సాహసించడం లేదు.
ఆమదాలవలస నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. జగ్గులశాస్త్రులపేటలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రం ఏర్పాటైంది. వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరుతో దానిని ధ్వంసం చేసింది. కానీ అక్కడ ఎటువంటి మైదానం ఏర్పాటు చేయలేదు. దీంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నరసన్నపేటలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రం కొంతవరకూ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇండోర్ స్టేడియం నిర్మాణం నిలిచిపోయింది. బ్యాడ్మింటన్ ఉడెన్ కోర్టు నిర్మాణం నిధులు లేక నిలిపివేశారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది.
శ్రీకాకుళం నియోజకవర్గంలో పాత్రునివలస, కళింగపట్నంలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని భావించారు. కళింగపట్నంలో 25శాతం పనులతో నిలిపివేశారు. పాత్రునివలసలో గోడల వరకూ నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రణస్థలంలో క్రీడావికాస కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేశారు. కానీ నిర్వహణను గాలికొదిలేశారు. ఇక్కడ ఒక్క శిక్షకుడు మాత్రమే ఉన్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో పడకేసిన క్రీడా వికాస కేంద్రాలను వీలైనంతవరకూ అందుబాటులోకి తేవాలని క్రీడాకారులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
జిల్లాలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం తప్పకుండా వీటి నిర్మాణం పూర్తిచేస్తుంది. త్వరలో సిబ్బంది, శిక్షకులను సైతం నియమించే అవకాశం ఉంది. ఆగిపోయిన పలాస, ఇచ్ఛాపురం ప్రాజెక్టులకు సంబంధించి మళ్లీ అనుమతి కోసం కలెక్టర్‌కు నివేదిక అందజేశాం.
- శ్రీధర్, డీఎస్‌డీవో, శ్రీకాకుళం