Share News

పత్తి రైతు చిత్తు!

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:54 PM

cotton formers problems జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో భాగంగా పత్తి సాగుచేయగా.. తొలి దశలో వర్షాలు కురవక నష్టం కలిగింది. పంట చేతికందే సమయానికి తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి పంటను రైతులు కాపాడుకున్నారు. కానీ మద్దతు ధర లభించక.. అమ్ముకునే మార్గం లేక రైతులు లబోదిబోమంటున్నారు.

పత్తి రైతు చిత్తు!
రణస్థలంలో ఓ ఇంటి వద్ద ఆరబెట్టిన పత్తి

  • జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేక ఇక్కట్లు

  • గత రెండు నెలలుగా ఇంటి వద్దే పంట

  • రవాణా భారం మోయలేక దళారులకు విక్రయాలు

  • రణస్థలం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో భాగంగా పత్తి సాగుచేయగా.. తొలి దశలో వర్షాలు కురవక నష్టం కలిగింది. పంట చేతికందే సమయానికి తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి పంటను రైతులు కాపాడుకున్నారు. కానీ మద్దతు ధర లభించక.. అమ్ముకునే మార్గం లేక రైతులు లబోదిబోమంటున్నారు. గత రెండునెలలుగా ఇంట్లోనే నిల్వ ఉంచారు.

  • జిల్లాలోని జి.సిగడాం, లావేరు, రణస్థలం, కొత్తూరు, సరుబుజ్జిలి, పొందూరు తదితర మండలాల్లో ఎక్కువగా పత్తి సాగవుతోంది. ఈ ఏడాది సుమారు 1970 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాభావం, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో పత్తిని సాగుచేస్తే 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ ఈ ఏడాది 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. అయితే అమ్మకాలు చేయడానికి జిల్లాలో కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి విక్రయించాలంటే విజయనగరం జిల్లా రాజాం, పార్వతీపురం మన్యం జిల్లా రామభద్రపురంలో కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే. దీంతో రవాణా ఖర్చులు అదనపు భారంగా మారుతాయి. అయితే ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. క్వింటా రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం క్వింటా పత్తిని రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ రూ.3 వేల నష్టానికి అమ్ముకుంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి జిల్లాలోనే పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • కేంద్రాలకు తరలించాలి

  • రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలి. సీసీఐ నిబందనల మేరకు 8 నుంచి 12 మధ్యలో తేమ ఉంటే మంచి మద్దతు ధర లభిస్తుంది. విధిగా ఈక్రాఫ్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉండాలి. 8 వేల ఎకరాలు సాగు చేస్తేనే నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రం మంజూరు అవుతుంది.

    - బి.రవికిరణ్‌, ఏడీ(ఎఫ్‌ఏసీ), మార్కెటింగ్‌ శాఖ, శ్రీకాకుళం

Updated Date - Nov 29 , 2025 | 11:54 PM