టీచర్లకు కొత్త టె(స్ట్)ట్
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:23 AM
ఇన్‌సర్వీసు టీచర్లు సైతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది.
- సుప్రీం కోర్టు తీర్పుతో ఆందోళన
- ఉపాధ్యాయ అర్హత పరీక్షపై విస్తృత చర్చలు
- జిల్లాలో 9,800 మంది ఉపాధ్యాయులపై ప్రభావం
నరసన్నపేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీసు టీచర్లు సైతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, టీచర్లు ఇద్దరూ టెట్ రాసేందుకు వీలుగా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో 2010వ సంవత్సరానికి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. టెట్ పరీక్షపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటనేదీ లేకపోయినా గతంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్, తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు ఒకింత ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 14,300 మంది టీచర్లు..
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో 14,300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 9,800 మంది టెట్‌లో ఉత్తీర్ణత కావాల్సి ఉంది. టెట్‌కు ప్రిపేర్‌కావడం, ఉత్తీర్ణత సాధించడం మినహా ప్రత్యామ్నాయం లేదని వారు భావిస్తున్నారు. దళాబ్దాల బోధనానుభవం ఉన్న టీచర్లు మళ్లీ ఇప్పుడు అర్హత పరీక్ష (టెట్) ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1998 డీఎస్సీ నుంచి 2006 డీఎస్సీ వరకు ఎంపికైన ఉపాధ్యాయులే ప్రస్తుతం జిల్లాలో అత్యధికంగా పనిచేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆద్వర్యంలో సుమారు 2,300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండుగా జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల్లో సుమారు 12వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 2012 డీఎస్సీ నుంచి ఇటీవల నిర్వహించిన 2025 మోగా డీఎస్సీ వరకు ఎంపికై వివిధ పాఠశాలల్లో సుమారు 4,500 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు మినహా మిగతా 9,800 మంది టెట్ రాయాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయు వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
అసలు ఏంటీ సమస్య...
ఉపాధ్యాయ విద్యకు సంబందించి డీఎడ్, బీఎడ్ అర్హతలున్నప్పటికీ, ఉద్యోగ నియామకాలకు అర్హత పరీక్ష టెట్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టులో ఎన్సీటీఈఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికనుగుణంగానే తదుపరి ఉపాధ్యాయ నియామకాలన్నింటికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఆ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2012 రిక్రూట్‌మెంట్ నుంచి టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 2014, 2018 తాజాగా మోగా డీఎస్పీ -2025 నియామకాలన్నీ టెట్ ఉత్తీర్ణులతోనే జరిగినందున వీరి విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. ఈ క్రమంలో గతంలో అంటే 2010 కి ముందు ఉద్యోగంలో చేరిన టీచర్లు కూడా ఇప్పుడు టెట్‌రాసి అర్హత సాధించాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునివ్వడం, ఆమేరకు రెండేళ్లలోపే టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని నిబంధన విధించడం.. ఉపాద్యాయుల్లో ఆందోళనకు కారణమైంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఐదేళ్లకు పైబడి ఉద్యోగ కాలం ఉన్న టీచర్లంతా రెండేళ్ల వ్యవధిలో టెట్‌రాసి ఉత్తీర్ణులు కావాల్సిందే. అలా ఉత్తీర్ణత కాకపోతే ఉద్యోగంలో కొనసాగింపుపై టీచర్లలో డైలామా నెలకొంది.
ఒక వేళ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరైతే..
150 మార్కులకు రెండున్నర గంటల వ్యవధితో ఉండే ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ఓసీ కేటగిరీ వారు 90మార్కులు (60శాతం) బీసీలు 75మార్కులు (50శాతం) ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 60మార్కులు (40శాతం) సాధించాల్సి ఉంటుంది. ఎస్టీటీలైతే టెట్ పేపర్ -1 స్కూల్ అసిస్టెంట్లయితే పేపర్-2 రాయాలి. ఏ కేడర్ టీచర్లయినా 2030 సెప్టెంబరు 30 తేదీలోగా రిటైరయ్యేవారు మాత్రం టెట్ రాయనవసరంలేదని చెబుతున్నారు. కానీ ఈ వ్యవధిలో ఉద్యోగన్నతి పొందాలంటే మాత్రం టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఆ ప్రకారం ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ 2027 సెప్టెంబరు 30 లోగా టెట్ అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డీఈవో రవిబాబును వివరణ కోరగా.. ‘ఇన్ సర్వీస్ టీచర్లు టెట్‌లో అర్హత సాధించాలన్న విషయంపై సామాజిక మాధ్యమాల ద్వారానే నాకు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అఽధికారిక సమాచారం లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే టెట్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తాం.’అని తెలిపారు.