Share News

త్వరలో కొత్త టీచర్లు

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:45 AM

మెగా డీఎస్సీ-2025 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

త్వరలో కొత్త టీచర్లు

- నేడో.. రేపో డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదల

- విద్యాశాఖ కసరత్తు

- అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు

- ఉమ్మడి జిల్లాలో 543 పోస్టులు

- పరీక్షలు రాసింది 22,648 మంది

- టెట్‌ మార్కుల సవరణకు ముగిసిన గడువు

నరసన్నపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ యాజమాన్యాల పాఠశాలల్లో మొత్తం 543 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్కులను విద్యాశాఖ విడుదల చేసింది. తదుపరి మెరిట్‌ జాబితా, రిజర్వేషన్‌ కం రోస్టర్‌ మార్గదర్శకాల మేరకు సెలక్షన్‌ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, పోస్టింగ్‌ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో నోటీఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్య, మేనేజ్‌మెంట్‌, కేటగిరీ, మీడియం, సబ్జెక్టు వారీగా వివరాలు పంపాలని సూచించారు. ఈ నెల 31 నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను కూడా ఇదే ఫార్మేట్‌లో అందజేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు కేటాయించేందుకు పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు, అసలు టీచరే లేకుండా కేటగిరీ-3/4 ల్లో ఉన్న స్కూల్స్‌ వివరాలు, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నూతనస్థానాలకు బదిలీ అయినా రిలీవర్‌ లేక పాత స్కూలులోనే కొనసాగుతుంటే ఆ పాఠశాల వివరాలు, 50వాతం మందికి పైబడి టీచర్లు లేని పాఠశాలలు మొదలైన వివరాలను సేకరించడానికి జిల్లాస్థాయిలో ఈనెల 18న బృందాలను నియమించి, నిర్ణీత ఫార్మేట్‌లో క్షేత్రస్థాయి నుంచి డేటాను తీసుకోవాలని ఆదేశించారు.

- ఉమ్మడి జిల్లాలో 543 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌, మున్సిపాలిటీల్లో 458 పోస్టుల ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ 113, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ -81, సోషల్‌-70, బయాలజీ- 34, ఫిజికల్‌ సైన్సు -14 గణితం -33, ఇంగ్లీషు -65, హిందీ- 11, తెలుగు -37 పోస్టులు ఉన్నాయి. అలాగే, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమపాఠశాలల్లో 85 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ -33, సోషల్‌ -5, బయాలజీ-12, ఫిజికల్‌ సైన్సు -10, గణితం -13, ఇంగ్లీషు -12 పోస్టులకు ఉన్నాయి. మొత్తం 543 పోస్టులకు 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పురుషులు 9,653 మంది, మహిళలు 12,995 మంది ఉన్నారు. పురుషులు కంటే 3,342 మంది మహిళా అభ్యర్ధులు ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా పరిశీలిస్తే బీసీడీ నుంచి అఽత్యధికంగా 7,281 మంది దరఖాస్తు చేసుకోగా, బీసీసీ నుంచి కేవలం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎటువంటి రిజర్వేషన్‌ లేనివారు 653 మంది, బీసీఏలో 5,210 మంది, బీసీబీ 2,737 మంది, బీసీఈలో 107 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు తరువాత ఎస్సీ కేటగిరీ -1లో 516 మంది, ఎస్సీ కేటగిరీ-2 నుంచి 666 మంది, ఎస్సీ కేటగిరీ -3 నుంచి 3,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ విభాగం నుంచి 2,377 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 408 మంది, దివ్యాంగుల విభాగంలో దృష్టిలోపం గలవారు 128 మంది, వినికిడి లోపం ఉన్న వారు 32 మంది, శారీరక వైకల్యం ఉన్న వారు 441 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈ ఏడాది జూన్‌ 2 నుంచి జూలై 7 వరకు డీఎస్సీ పరీక్షలు రాశారు. ఆగస్టు 15 నాటికి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగు రోజులు ముందే విడుదల చేసింది. టెట్‌ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పులతడకలుగా పొందుపరిచారు. టెట్‌ మార్కులను సవరణ చేసి తుదిజాబితాను విద్యాశాఖ డీఎస్సీ -2025 వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనిపై అభ్యంతరాలకు ఆదివారంతో గడువు ముగిసింది. సోమవారం తుది మార్కుల జాబితాను విడుదల చేసి, మంగళవారం నుంచి మెరిట్‌ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలపై విద్యాశాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 18 , 2025 | 12:45 AM