Share News

Rice cards: కొత్త రైస్‌కార్డులు వస్తున్నాయ్‌

ABN , Publish Date - May 07 , 2025 | 11:45 PM

Ration card distribution రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త రైస్‌కార్డులు ఇవ్వనుంది. బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. నెలరోజులు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆపై వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు ఇవ్వనుంది. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Rice cards: కొత్త రైస్‌కార్డులు వస్తున్నాయ్‌
చాపర సచివాలయలంలో రైస్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తున్న దృశ్యం

  • సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

  • నెలరోజులపాటు కొనసాగునున్న ప్రక్రియ

  • మార్పులు, చేర్పులకూ అవకాశం

  • వసుంధర గ్రామానికి చెందిన ఎస్‌.వరదరాజులు రేషన్‌కార్డు కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. వివాహమై ఒక ఆడపిల్ల జన్మించినా.. రేషన్‌కార్డు లేక ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా బుధవారం ఆయన సచివాలయానికి వెళ్లి కొత్త రైస్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో కొత్త రైస్‌ కార్డు వచ్చే అవకాశం ఉంది.

  • మెళియాపుట్టి గ్రామానికి చెందిన కె.మేఘనాథానికి ఏడాదిన్నర కిందట వివాహమైంది. తమ రేషన్‌కార్డులో భార్య పేరు చేర్పించాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైస్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

  • ఎంసీపీ కొత్తూరు గ్రామానికి చెందిన సవర కూర్మారావుకు వివాహమై రెండున్నరేళ్లు అవుతున్నా.. రేషన్‌కార్డు లేక ఇబ్బందులు పడుతున్నాడు. కార్డు లేకపోవడంతో ఇల్లు స్థలం, తదితర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం కొత్త రైస్‌ కార్డులకు అవకాశం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

  • మెళియాపుట్టి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త రైస్‌కార్డులు ఇవ్వనుంది. బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. నెలరోజులు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆపై వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు ఇవ్వనుంది. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలో 1,625 రేషన్‌ దుకాణాల పరిధిలో 6,71,803 కార్డులు ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డులు 6,35,471 ఉండగా.. 36,332 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మొత్తంగా 19,77,693 మంది లబ్ధిదారులకు ప్రతినెలా 422 ఎండీయూ వాహనాల ద్వారా 9.737 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకోసారి రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ, 2023 మే నుంచి కొత్త రేషన్‌కార్డుల పక్రియ నిలిపేసింది. దీంతో చాలామంది రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు కేవలం సబ్సిడీతో అందిస్తున్న సరుకులకే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలకూ ముడిపడి ఉంది. ప్రధానంగా వైద్యసేవలు పొందేందుకు ఆరోగ్యశ్రీతో పాటు, పేద విద్యార్థుల ఉన్నత చదువులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర ఎన్నో సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కాగా రేషన్‌కార్డులేకపోవడంతో చాలామంది ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో సుమారు 25వేల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా గత రెండేళ్ల నుంచి రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడంతో వారంతా ఊరట చెందుతున్నారు.

  • తప్పులు సరిదిద్దుకునేలా..

    రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. కొత్త కార్డుకు దరఖాస్తు, కుటుంబ సభ్యుల విభజన, కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పు, మృతుల పేర్లు తొలగింపు, రేషన్‌ కార్డు స్వచ్ఛందంగా వదులుకోవడం.. తదితర వాటికి ఆప్షన్లు ఇచ్చారు. గతంలో తప్పుడు చిరునామాతోపాటు ఇంటి పేర్లు, లబ్ధిదారుల పేర్లు తప్పులుగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి వారికి మార్పులు చేసుకోనే అవకాశం కల్పించడంతో ఊరట లభించనుంది. పాత రేషన్‌కార్డుల లబ్ధిదారులకు జూన్‌లో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు అందజేయనున్నారు. కార్డులపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మలను తొలగిస్తారు. కుటుంబ యజమాని పేరు, ఫొటో, కుటుంబ సభ్యుల సంఖ్య, రేషన్‌ దుకాణం ఐడీ, చిరునామా, క్యూఆర్‌ కోడ్‌తో కార్డులు అందజేస్తారు. ఈ విషయమై మెళియాపుట్టి తహసీల్దార్‌ బి.పాపారావు వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయాల్లో రైస్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని తెలిపారు. మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - May 07 , 2025 | 11:45 PM