mining policy : త్వరలో కొత్త మైనింగ్ పాలసీ
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:25 PM
New mining policy Government regulation వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన మైనింగ్ పరిశ్రమలో సమూలమార్పులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మైనింగ్ విధానంపై త్వరలో జీవో విడుదల చేయనుంది. దీనికోసం పరిశ్రమలు, గ్రానైట్ క్వారీల యాజమనులు ఎదురుచూస్తున్నారు.
ఎదురుచూస్తున్న గ్రానైట్ వ్యాపారులు
జిల్లాలో 200కు పైగా లీజుల దరఖాస్తులు పెండింగ్
టెక్కలి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన మైనింగ్ పరిశ్రమలో సమూలమార్పులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మైనింగ్ విధానంపై త్వరలో జీవో విడుదల చేయనుంది. దీనికోసం పరిశ్రమలు, గ్రానైట్ క్వారీల యాజమనులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో నీలిరంగు గ్రానైట్ పరిశ్రమ పెద్దఎత్తున విస్తరించి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 200కుపైగా లీజుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పట్లో నీలిరంగు గ్రానైట్ పరిశ్రమ పూర్తిస్థాయిలో వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడిచేది. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి అనుయాయులు సైతం గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ దోచుకున్నారు. జిల్లాలోని టెక్కలి, శ్రీకాకుళం గనులశాఖ ఏడీ, డీడీ కార్యాలయాల్లో ఫైళ్లు వైసీపీ పెద్దల ఆదేశాలతోనే కదిలేవి. వైసీపీకి అనుకూలంగా ఉంటే చాలు. గనులశాఖ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకొని వారి పేరున క్వారీ లీజులు అడ్డగోలుగా మంజూరు చేసేవారు. అనుకూలంగా లేని వ్యక్తుల క్వారీ లీజుల దరఖాస్తులను ఆక్షన్ విధానానికి సిఫారసు చేసేవారు. లేదా కొర్రీలు వేస్తూ లీజు ఫైలు పక్కన పడేసేవారు. 2019-24 మధ్యకాలంలో సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, నందిగాం, టెక్కలి, పలాస, కంచిలి, మందస తదితర ప్రాంతాల నుంచి సుమారు 200కుపైగా క్వారీల లీజుల కోసం పంచాయతీ, రెవెన్యూ అన్ని రకాల ఎన్‌వోసీలు పొంది ఆఖరికి గనుల శాఖ ద్వారా కమిషనర్ కార్యాలయం వరకు లీజుల మంజూరు కోసం ఫైల్ వెళ్లేది. ఈ పరిస్థితుల్లో వైసీపీ పెద్దల దృష్టి పడి క్వారీ లీజులు ఎలా కబ్జా చేయాలో ఆయా మైన్స్ కార్యాలయాల పరిధిలోని బ్రోకర్లు ద్వారా గుర్తించేవారు. ఉదాహరణకు సారవకోట మండలం దంత సమీపంలో సర్వేనెం.46లో ఐదు హెక్టార్ల గ్రానైట్ లీజులు చిన్మయి గ్రానైట్ లీజులు కోరగా.. అడ్డగోలుగా ఆక్షన్ విధానం అమలు చేసేశారు. అదే వైసీపీ పెద్దలకు అనుకూలమైన పొన్నవోలు కార్తీక్‌రెడ్డికి జిల్లాలో ఓ క్వారీ లీజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేటాయించారు. చాలా మంది క్వారీ లీజుల దరఖాస్తులను గనులశాఖ కార్యాలయంలోని బ్రోకర్ల ద్వారా వైసీపీ నేతలు పెండింగ్‌లో ఉంచేశారు. ఈ విధానాలకు కూటమి ప్రభుత్వం చెక్ చెప్పింది. గనుల శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. క్వారీల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించింది. కన్సడరైజేషన్ పన్నులు ఎత్తివేయడం, లీజుల కాలపరిమితి 20ఏళ్ల నుంచి 30ఏళ్లకు పెంచడం, క్వారీల డెడ్‌రెంట్లు సవరించింది. తాజాగా నూతన మైనింగ్ పాలసీని అమలు చేయనుంది. కాగా ఈ పాలసీలో సీనరీస్ చార్జీల పరిస్థితి, ఏ రకంగా ధరలు నిర్ణయిస్తారు, లీజులు కేటాయింపు అంశం, ఆన్‌లైన్ విఽధానాలు తదితర అంశాలపై పరిశ్రమల యాజమానులు ఎదురుచూస్తున్నారు.