Sanitation: పారిశుధ్యంపై నిర్లక్ష్యాన్ని సహించం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:53 PM
Municipal negligenceవర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గార, హిరమండలం ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గార, హిరమండలం ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం
ఎరువుల కొరత రానీయొద్దని స్పష్టం
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 22(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గార, హిరమండలం ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా నిర్వహించకపోతే కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. పీఆర్జీఎస్, కోర్టు కేసులు, ఎరువుల పంపిణీ, పీ-4 సర్వే పురోగతి వంటి అంశాలపై చర్చించారు. ‘మండలస్థాయి అధికారులు సిబ్బందితో, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమస్యల పరిష్కారం ఫాస్ట్‌ట్రాక్‌లో జరగాలి. కోర్టు కేసులపై అధికారులు సకాలంలో స్పందించాలి. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉండేలా పనిచేయాలి. నీటి నాణ్యత పరీక్షలు, కాల్వలు, హాస్టళ్ల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎరువుల పంపిణీలో కొరత అనే పదం వినిపించడానికి వీల్లేదు. ఎరువుల సరఫరాపై రోజువారీ నివేదికలు సమర్పించాలి. ఎంజీఎన్‌ఆర్జీఈజీఎస్ కింద తుప్పల తొలగింపు, రోడ్ల వెంట మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టాలి. పీ-4 సర్వే నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. బంగారు కుటుంబాలను యాప్‌లో నమోదు చేయాలి. ఈ నెలాఖరుకి మార్గదర్శుల గుర్తింపు పూర్తిచేయాల’ని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.