వంశధార కరకట్టలపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:05 AM
Unseen Vamsadhara works at the field level జిల్లాలో వంశధార నదికి ఇరువైపులా పటిష్ఠమైన కరకట్టలు నిర్మించి వరద ముప్పు తప్పిస్తామన్న హామీలు నీటి మూటలుగానే మిగిలి పోతున్నాయి. నిధులు మంజూరై ఎనిమిదేళ్లు దాటుతున్నా.. పనులు మాత్రం పునాది దశలోనే ఉన్నాయి.
ప్యాకేజీ-1, 2పనులు 7 శాతమే..
గడువు మాత్రం 2027 వరకు పెంపు
ప్యాకేజీ-3 అంచనాలు రూ.218 కోట్ల నుంచి రూ. 571 కోట్లకు..
ఐదేళ్ల కిందట ప్యాకేజీ-4 పనులు క్లోజ్.. తాజాగా కొత్త అంచనాలు
క్షేత్రస్థాయిలో కానరాని పనులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
శ్రీకాకుళం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంశధార నదికి ఇరువైపులా పటిష్ఠమైన కరకట్టలు నిర్మించి వరద ముప్పు తప్పిస్తామన్న హామీలు నీటి మూటలుగానే మిగిలి పోతున్నాయి. నిధులు మంజూరై ఎనిమిదేళ్లు దాటుతున్నా.. పనులు మాత్రం పునాది దశలోనే ఉన్నాయి. ‘ప్రత్యేక పరిశోధనా విభాగం’ నివేదిక సాక్షిగా వెలుగు చూసిన అంశాలు.. అధికారుల జాప్యాన్ని.. పాలకుల మౌనాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్యాకేజీ-1 గడువు ముగిసి 6 ఏళ్లు కాగా, ఇప్పటివరకు ఏడు శాతం మాత్రమే పనులు జరిగాయి. ప్రస్తుతం 2027 వరకు గడువు పెంచారు. అలాగే ప్యాకేజీ-2 గడువు ముగిసి 6 ఏళ్లు అయింది. 6.70 శాతం పని జరిగింది. మళ్లీ పాత కాంట్రాక్టరే. ప్యాకేజీ-3 పనుల అగ్రిమెంట్ రద్దయి 6 ఏళ్లు అయింది. కొత్త ధరలతో రూ.353 కోట్లు అదనపు భారం పడనుంది. ప్యాకేజీ-4 అగ్రిమెంట్ జరిగి 16 ఏళ్లు (2009లో) కాగా, ఇప్పటికీ పనులు అసంపూర్ణమేనని నివేదిక స్పష్ట చేస్తోంది.
పనిచేయని వారికే మళ్లీ..
2018లో రూ.249 కోట్లతో ప్యాకేజీ-1, రూ.149 కోట్లతో ప్యాకేజీ-2 పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తే.. ఇప్పటికి జరిగింది కేవలం 7 శాతం మాత్రమే. నిబంధనల ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లా యంత్రాంగం వారికే రెడ్ కార్పెట్ పరిచింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే.. 25 శాతం పనులు కూడా పూర్తి చేయని ఏజెన్సీలనే కొనసాగిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పైగా 2027 జనవరి 31 వరకు గడువు కూడా పెంచింది. ఏడేళ్లుగా చేయని పనిని.. ఇప్పుడు చేస్తారని నమ్మడం వెనుక ఉన్న మతలబు ఏంటి?
అంచనాల పెంపులో జెట్ స్పీడ్..
ఎల్.ఎన్.పేట నుంచి కళింగపట్నం వరకు ప్యాకేజీ-3 పనులు మరీ దారుణం. చట్టవిరుద్ధమైన అభ్యాసాలకు పాల్పడ్డారంటూ కాంట్రాక్ట్ సంస్థ(ఎం/ఎస్ ఆర్‌ఎస్‌ఆర్)ను 2019లోనే తప్పించారు. అప్పుడు అగ్రిమెంట్ విలువ రూ. 218కోట్లు. ఇప్పుడు మిగిలిన పనులకు ఎస్‌ఎస్‌ఆర్ 2025-26 రేట్ల ప్రకారం ఏకంగా రూ.571.75 కోట్లతో కొత్త అంచనాలు రూపొందించారు. దాదాపు రూ. 353 కోట్లు అదనం. పనులు చేయకుండా తాత్సారం చేసి ఇప్పుడు కొత్త రేట్ల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది చర్చనీయాంశమవుతోంది.
16 ఏళ్లుగా అంతే..
జలుమూరు నుంచి పోలాకి వరకు కరకట్టలు నిర్మించే ప్యాకేజీ-4 పనులు 2009లో మొదలయ్యాయి. ఇప్పటికి 16 ఏళ్లు గడిచినా పని పూర్తి కాలేదు. 2020లో పరస్పర అంగీకారతో పనులు ఆపేయాలని నిర్ణయించారు. కానీ నేటికీ ఫైనల్ బిల్లుల గొడవ తెగలేదు. బిల్లుల్లో రిమార్కులు ఉన్నాయని.. సరిచేయాలని అధికారులు లేఖలు రాసుకుంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మిగిలిన పనులకు ఇప్పుడు రూ.286.50 కోట్లతో భారీ అంచనాలు సిద్ధం చేశారు. 2020లో పనులు ఆపేస్తే.. కొత్త పనులు మొదలుపెట్టడానికి 2025 వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఈ ఐదేళ్ల జాప్యానికి బాధ్యులెవరు..?
లేఖలతోనే సరిపెడతారా...?
క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా.. ఆఫీసుల్లో కాగితాలు మాత్రం చకచకా కదలుతున్నాయి. ప్యాకేజీ-1, 2లకు సంబంధించి గత నవంబరు నెలలో పనులు ప్రారంభించాలని లేఖలు రాశారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు(మోస్ట్ వల్నర్‌బుల్ రీచెస్) అని గుర్తించిన చోట్ల కూడా పనులు చేపట్టకుండా.. 2022లో ఇచ్చిన నివేదికను పట్టుకుని 2025 వరకు అనుమతుల కోసం ఎదురుచూడటం అధికారుల పనితీరుకు నిదర్శనం.
ప్రజాప్రతినిధుల మౌనం..
వరదలు వచ్చినప్పుడు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు .. ఆ తర్వాత కరకట్టల ఊసే ఎత్తకపోవడం రివాజుగా మారింది. వేలకోట్ల రూపాయల ప్రాజెక్టు పడకేసినా.. అంచనాలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నా సమీక్షించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2027 గడువులోగానైనా పనులు పూర్తవుతాయా? లేక మళ్లీ ధరల పెంపు కోసమే ఈ సాగతీతా? అన్నది తేలాల్సి ఉంది.