Share News

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:59 PM

Quiskit Pal Fest ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భవిష్యత్‌ అంతా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తోనే. సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల’ని అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ముఖ్య సలహాదారు, ఐబీఎం క్వాంటమ్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ ఎల్‌.వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు.

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
క్వాంటమ్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ వెంకట సుబ్రహ్మణ్యాన్ని సత్కరిస్తున్న ఎంపీ శ్రీ భరత్‌, ఎమ్మెల్యే ఈశ్వరరావు, ట్రిపుల్‌ ఐటీ అధికారులు

ఐబీఎం క్వాంటమ్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ వెంకట సుబ్రహ్మణ్యం

అట్టహాసంగా ప్రారంభమైన క్విస్కిట్‌ పాల్‌ ఫెస్ట్‌

ఎచ్చెర్ల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భవిష్యత్‌ అంతా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తోనే. సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల’ని అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ముఖ్య సలహాదారు, ఐబీఎం క్వాంటమ్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ ఎల్‌.వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌లో మంగళవారం ఐబీఎం క్వాంటమ్‌ సహకారంతో క్విస్కిట్‌ పాల్‌ ఫెస్ట్‌ -2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా 55 విద్యా సంస్థల్లో ఈ ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ ఈ ఫెస్ట్‌ నిర్వహణకు వేదిక కావడం విశేషం. ఈ నెల 27 వరకు నిర్వహించనున్న ఈ ఫెస్ట్‌ కోసం ఆన్‌లైన్‌లో 46 వేల మంది, ఆఫ్‌లైన్‌లో 4 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తొలిరోజు ఫెస్ట్‌ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఐబీఎం క్వాంటమ్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ ఎల్‌.వెంకట సుబ్రహ్మణ్యం హాజరై ప్రసంగించారు. ‘సాంకేతికపరంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. బ్యాంకింగ్‌ రంగంలో క్వాంటమ్‌ టెక్నాలజీ వినియోగం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీని వల్ల బ్యాంకింగ్‌లో 34 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయి. నేషనల్‌ క్వాంటమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీ అభివృద్ధికి రూ.6 వేల కోట్లను కేటాయించింది. దీని ద్వారా వాతావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక, ఇంధనం తదితర రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించగలమ’ని ఆయన తెలిపారు.

రోల్‌మోడల్‌గా వ్యవహరించాలి

మరో అతిథి విశాఖ ఎంపీ ఎం.శ్రీ భరత్‌ మాట్లాడుతూ.. ‘ఈ క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు రోల్‌ మోడల్‌గా వ్యవహరించాలి. ఇక్కడి క్యాంపస్‌లో ఫెస్ట్‌ నిర్వహణ రాష్ట్రానికే గర్వకారణం. సాంకేతిక రంగంలో మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. నైపుణ్యం, కష్టపడే తత్వంతోనే మెరుగైన ఫలితాలు సాధించగలరు. క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. ప్రతి విద్యార్థి వ్యక్తిగత ప్రేరణతోనే సమస్యల పరిష్కారానికి నైపుణ్యం పెంపొందించుకోవాల’ని సూచించారు.

గ్లోబల్‌ లీడర్స్‌గా ఎదగాలి

ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులు గ్లోబల్‌ లీడర్స్‌గా ఎదగాలి. ఉద్యోగాలు కల్పించే దిశగా విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు ముందడుగు వేయాల’ని తెలిపారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీడీజీ బాలాజీ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు ఈ ఫెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలి. క్వాంటమ్‌ టెక్నాలజీని ఇంజనీరింగ్‌లో మైనర్‌ సబ్జెక్ట్‌గా తీసుకువస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఏవో డాక్టర్‌ ముని రామకృష్ణ, ఫెస్ట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.శివరామకృష్ణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వాసు, కోకన్వీనర్‌లు రవి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:59 PM