సహజవాయువు ప్రాజెక్టు నేడు జాతికి అంకితం
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:58 PM
దేశంలో సహజవాయువు గ్రిడ్‌ను మరింత శక్తివంతం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గెయిల్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీకాకుళం-అంగుల్ సహజవాయువు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.
- శ్రీకాకుళం నుంచి ఒడిశా వరకు పైపులైన్ పూర్తి
- రూ.1,730 కోట్లతో నిర్మాణం
- కర్నూలు నుంచి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శ్రీకాకుళం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో సహజవాయువు గ్రిడ్‌ను మరింత శక్తివంతం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గెయిల్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీకాకుళం-అంగుల్ సహజవాయువు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కలసి గురువారం కర్నూలు నుంచి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
రూ. 1,730 కోట్లతో నిర్మాణం..
ఈ ప్రాజెక్టుకు రూ.1,730 కోట్ల వ్యయం చేశారు. కాకినాడ-శ్రీకాకుళం పైపులైన్లతో ఒడిశా (అంగుల్) వద్ద గెయిల్ సంస్థ సహకారంతో జగదీశ్‌పూర్-హల్దియా-బొకారో-ధమ్రా ప్రాజెక్టు కనెక్ట్ అయ్యేలా ప్రాజెక్టును రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అంగుల్ వరకు సుమారు 422 కిలోమీటర్ల పొడవునా నాచురల్ గ్యాస్ పైప్‌లైన్-ఎస్‌ఏపీఎల్ నిర్మాణం జరిగింది. జిల్లాలో పైపులైన్ల ఏర్పాటులో కాస్త ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో 124 కిలోమీటర్లు.. ఒడిశా లో 298 కిలోమీటర్ల పరిధిలో పైపులైన్లు ఉంటాయి. శ్రీకాకుళం నుంచి బరంపురం వరకు రోజుకి ఐదు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్(ఎంఎంఎస్‌సీఎండీ), అలాగే బరంపురం నుంచి అంగుల్ వరకు 4.5 ఎంఎంఎస్‌సీఎండీ కెపాసిటీగా నిర్దేశించారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనావేశారు. కానీ కాస్త ముందుగానే సిద్ధంచేయడంతో నేడు ప్రారంభానికి నోచుకుంది.
పారిశ్రామిక అభివృద్ధికి దోహదం..
గ్యాస్ గ్రిడ్ విస్తరణలో భాగంగా ఈ పైపులైన్ నిర్మాణం జరిగింది. ఆంధ్ర-ఒడిశా ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా మరింత వీలుగా ఉంటుంది. అవసరమైన పరిశ్రమలకు గ్యాస్ సరఫరాకు అవకాశం ఏర్పడింది. అల్యూమినియం, బాక్స్‌రో, విద్యుత్ ఉత్పత్తి, రసాయన పరిశ్రమలు.. ఇవన్నీ గ్యాస్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. గ్యాస్ గ్రిడ్ విస్తరణ వల్ల రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధితోపాటుగా ఫ్యూయల్ ఖర్చుల తగ్గింపు సాధ్యమవుతుంది. అన్నింటికంటే ఇళ్లకు, కమర్షియల్ యూనిట్లు, వంట గ్యాస్, వాహన ఇంధనం వంటి విభిన్న అవసరాలకు గ్యాస్ సమకూర్చే అవకాశం ఉంటుంది. అలాగే లక్షల మందికి ఉపాధి కలగనుంది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అభివృద్ధికి దోహపడుతుంది. పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తుంది.