Share News

సహజ అందాలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:05 AM

Today is World Tourism Day శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రసిద్ధ ప్రదేశాలు..క్షేత్రాలు... సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. బారువ, కళింగపట్నంలోని సాగర తీరం.. శాలిహుండాం బౌద్ధ స్థూపాలు..అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడి చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి.

సహజ అందాలు
శాలిహుండాంలోని స్థూపాలు, ప్రాకారాలు

జిల్లాలో ఎన్నో పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రసిద్ధ ప్రదేశాలు..క్షేత్రాలు... సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. బారువ, కళింగపట్నంలోని సాగర తీరం.. శాలిహుండాం బౌద్ధ స్థూపాలు..అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడి చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కొన్ని కథనాలు..

పర్యాటకం బారువకు వరం

సోంపేట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక ప్రదేశాల పేరు చెబితే ఠక్కున గుర్తుకు వచ్చేది బారువ బీచ్‌. సమీప గ్రామాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమబెంగాల్‌ నుంచి కూడా తరచూ ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. దేశంలోనే ఎత్తయిన ఇసుక దిబ్బలు ఇక్కడి ప్రత్యేకతను చాటుతాయి. బారువ తీరంలో నిర్మించిన లైట్‌ హౌస్‌ ప్రత్యేకార్షణగా నిలుస్తోంది. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతీ వ్యక్తి లైట్‌హౌస్‌ను సందర్శించకుండా ఉండలేరు. లైట్‌ హౌస్‌ పక్కన నిర్మిస్తున్న కాటేజీలు సైతం పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాకుళం నుంచి ఇటు ఒడిశా వరకు పర్యాటకులు కాటేజీలను చూసేందుకే వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సౌకర్యాలు ఉండటంతో పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరిగిపోతోంది.

ఎలా వెళ్లాలంటే...

సోంపేట రైల్వే స్టేషన్‌ (కంచిలి)లో దిగి సోంపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి పలాస వైపు వెళ్లే ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు బారువ గ్రామంలోకి వెళతాయి. అక్కడి నుంచి బీచ్‌కు చేరుకోవచ్చు. పలాస నుంచి వచ్చే బస్సుల్లోనూ బారువ చేరుకోవచ్చు.

బౌద్ధం వికసించిన శాలిహుండాం

గార, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): బౌద్ధం వికసించిన నేల శాలిహుండాం. అక్కడ బౌద్ధుల కాలం నాటి ఎత్తయిన పెద్ద స్థూపం... దానికి ఎదురుగా విశాలమైన స్థూపాలు, ప్రాకారాలు, చైత్యాలు... వందల ఏళ్ల నాటి చరిత్రకు ఆనవాలుగా మిగిలి ఉన్నాయి. పవిత్ర వంశధార నది గలగలలతో.. చుట్టూ పచ్చని ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ బౌద్ధ క్షేత్రాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా టిబెట్‌, చైనా, భూటాన్‌ తదితర దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. బౌద్ధుల కాలం నాటి ఈ చారిత్రక ప్రదేశం పురావస్తు శాఖ పరిధిలో ఉంది. 1965లో ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన బౌద్ధుల శిలా విగ్రహాలు, శిలా శాసనాలు భద్రపరిచి భావితరాలకు మన చరిత్ర, వారసత్వ సంపదను అందించాలన్న సంకల్పంతో అక్కడే ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను కూడా సందర్శకులు కూడా చూడవచ్చు. కార్తీక మాసంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పాఠశాలల విద్యార్థులు, పర్యాటకులు కుటుంబాలతో పిక్నిక్‌కు వస్తుంటారు. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సందర్శకుల రద్దీ ఉంటుంది.

ఇలా చేరుకోవచ్చు...

జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి 17 కిలోమీటర్లు దూరంలో శాలిహుండాం ఉంది. అక్కడికి చేరుకోవడానికి శ్రీకాకుళం నుంచి అరసవల్లి రూట్‌లో గార వరకు ఆర్‌ర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. గారలో దిగి కిలోమీటరు దూరం కాలినడకన అక్కడికి చేరుకోవచ్చు. సింగుపురం జంక్షన్‌ నుంచి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉండే ఈ ప్రదేశానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇటు రావివలస.. అటు తేలినీలాపురం

టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. ప్రపంచలొనే అతి ఎత్తయిన స్వయంభూలింగం ఇక్క ఉంది. కార్తీక మాసంలో ఇక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటరు... టెక్కలికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

విదేశీ పక్షుల విడిది కేంద్రం

విదేశీ విహంగాల విడిది క్షేత్రంగా తేలినీలాపురం దేశవ్యాపంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి సైబీరియా దేశపు పక్షులు తరలివస్తుంటాయి. ఏటా సంతానోత్పత్తికి వచ్చి.. ఆ తరువాత మళ్లీ సైబీరియాకు వెళుతుంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా టవర్లు ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది.

Updated Date - Sep 27 , 2025 | 12:05 AM