Nano fertilizer : నానో.. నోనో అనొద్దు!
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:56 PM
Late-fruiting fertilizer ఖరీఫ్ సాగు వేళ.. జిల్లాలోని చాలామంది రైతులు ఎరువులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. కాగా అన్నదాతలకు భారం తగ్గించేలా, ఇబ్బందులు తొలగించేలా యూరియాకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నానో రసాయనిక ఎరువులను అందుబాటులోకి తెచ్చింది.
ఆలస్యంగా ఫలితమిస్తున్న ఎరువు
అవగాహన లేక తగ్గిన వినియోగం
టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన దారపు పాపారావు అనే రైతు సుమారు పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. నాట్లు వేసిన తర్వాత యూరియా అందుబాటులో లేకపోవడంతో నానో రసాయన ఎరువును తెచ్చి.. డ్రోన్‌తో పిచికారీ చేయించాడు. మొదటి వారం ఆ రసాయన ఎరువు పూర్తిగా పనిచేయనట్టు కనిపించడంతో ఆందోళన చెందాడు. కానీ 20రోజుల తర్వాత వరిపంట ఏపుగా పెరిగి దుబ్బు కట్టడంతో ఆనంద పడుతున్నాడు. కాస్త ఆలస్యంగా ఫలితం చూపినా.. తక్కువ పెట్టుబడితో డ్రోన్ ద్వారా తొలివిడత ఎరువు చల్లానని తెలిపాడు.
టెక్కలి రూరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగు వేళ.. జిల్లాలోని చాలామంది రైతులు ఎరువులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. కాగా అన్నదాతలకు భారం తగ్గించేలా, ఇబ్బందులు తొలగించేలా యూరియాకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నానో రసాయనిక ఎరువులను అందుబాటులోకి తెచ్చింది. కానీ దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా నానో వినియోగంపై రైతులు ఆసక్తి చూపడం లేదు. యూరియా బస్తాల కోసమే ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 4,47,387 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. జిల్లాకు 23,474 నానో ఎరువుల బాటిళ్లను కేటాయించారు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో నానో ఎరువులు చెల్లుబాటు కావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
తక్కవ పెట్టుబడితో :
ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా బస్తా యూరియాను రూ.267కు విక్రయిస్తోంది. అదే బహిరంగ మార్కెట్లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. నానో యారియా అయితే 500 మి.లీ. బాటిల్ మార్కెట్‌లో రూ.225 నుంచి రూ.249కి దొరుకుతోంది. ఎకరాకు 550 మి.లీ. రసాయన ఎరువు సరిపోతుంది. ప్రభుత్వం డీఏపీ బస్తాను రూ.1350కి విక్రయిస్తోంది. నానో డీఏపీ అయితే లీటర్ రూ.595కే దొరుకుతోంది. ఎరువుల బస్తాలయితే మోయాలి. కానీ నానో సీసాలు సులువుగానే తీసుకెళ్లిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా నానో ఎరువుల వల్ల దిగుబడి తగ్గిపోతుందనే అపోహ కొంతమంది రైతుల్లో ఉంది. గతేడాది నానో ఎరువులు చల్లి ఇబ్బందులు పడ్డామని పేర్కొంటున్నారు. అయితే నానో ఎరువుల్లో గతేడాది 20 శాతం నత్రజని ఉండేదని, ఈ ఏడాది దానిని 40 శాతానికి పెంచామని అధికారులు చెబుతున్నారు. దిగుబడి బాగా వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
దోమపోటు లేదు:
గతంలో యూరియా అధికంగా ఎకరాకు మూడు నుంచి ఐదు బస్తాల వరకు వినియోగించేవారు. దీంతో వరినాట్లు వేయగానే పురుగుపట్లు కనిపించేవి. మళ్లీ మందులు పిచికారీ చేసేవారు. ఈ ఏడాది ఎకరాకు 25 కిలోలు చొప్పున మాత్రమే.. మూడు విడతల్లో వినియోగించాలని అధికారులు చెబుతున్నారు. గతేడాది కన్నా యూరియా వినియోగం తగ్గడంతో ఈ ఏడాది ఎక్కడా దోమపోటు తెగులు కనిపించడం లేదని పేర్కొంటున్నారు. మోతాదుకు మించి యూరియా వినియోగించరాదని స్పష్టం చేస్తున్నారు.