టెక్కలిలోకి నందిగాం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:49 PM
Nandigam went to Tekkali జిల్లా సౌకర్యమే లక్ష్యంగా.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో మార్పులు చేస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంతో సమీక్ష నిర్వహించారు. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నందిగాం మండలాన్ని ఇకపై టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో విలీనానికి ఆమోదం తెలిపారు.
పలాస డివిజన్ నుంచి మారుస్తూ నిర్ణయం
మంత్రుల కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర
తీరనున్న ప్రజల కష్టాలు..
మరింత చేరువ కానున్న పరిపాలనా సేవలు
శ్రీకాకుళం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా సౌకర్యమే లక్ష్యంగా.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో మార్పులు చేస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంతో సమీక్ష నిర్వహించారు. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నందిగాం మండలాన్ని ఇకపై టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో విలీనానికి ఆమోదం తెలిపారు. దీంతో పాలన మెరుగుపడనుందని, ప్రయాణ భారం తగ్గనుందని ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో గెజిట్ నోటిఫికేషన్..
జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ల సవరణలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అఽధికారుల నివేదికలను పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసిన ఈ కమిటీ.. నందిగాం మండలాన్ని పలాస నుంచి తప్పించి, టెక్కలి డివిజన్‌లో కలపాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిని నిశితంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అధికారికంగా ‘నందిగాం’ మండలాన్ని టెక్కలి డివిజన్ పరిధిలోకి బదలాయించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ప్రజలకు తప్పనున్న దూరాభారం..
నందిగాం మండలం భౌగోళికంగా టెక్కలికి అత్యంత సమీపంలో ఉంటుంది. పైగా టెక్కలి నియోజకవర్గం పరిధి మండలం కూడా. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం.. జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. కారణాలతో పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలో చేర్చింది. దీంతో పరిపాలనాపరమైన పనుల కోసం.. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రైతులు, సామాన్య ప్రజలు పలాస వెళ్లాల్సి వచ్చేది. ఇది దూరాభారంతో పాటు, సమయం, డబ్బు వృథా అయ్యేలా చేస్తోందన్న ఆవేదన స్థానికుల్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నందిగాం వాసులకు ఆర్డీవో కార్యాలయం మరింత చేరువ కానుంది. టెక్కలి డివిజన్‌లోకి మారడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని, పనులు వేగవంతం అవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.