టెక్కలి డివిజన్‌లోకి నందిగాం
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:20 PM
జిల్లా రెవెన్యూ పరిపాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది.
- ప్రభుత్వం తుది నోటిఫికేషన్
- నేటి నుంచి అమల్లోకి
శ్రీకాకుళం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ పరిపాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నందిగాం మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి తొలగించి టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జీవోను జారీ చేశారు. ఈ సవరణ బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
- నందిగాం చేరికతో టెక్కలి రెవెన్యూ డివిజన్ పరిధి 10 మండలాలకు పెరిగింది. ఇందులో టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనర్సుపేట, నందిగాం మండలాలు ఉన్నాయి.
- పలాస డివిజన్ ఏడు మండలాలకు పరిమితమైంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి.
- శ్రీకాకుళం డివిజన్‌లో 13 మండలాలు యథాతథంగా కొనసాగుతాయి. ఇందులో శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పోలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం, జలుమూరు మండలాలు ఉన్నాయి.
ప్రజల కోరిక నెరవేరింది : మంత్రి అచ్చెన్నాయుడు
నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో విలీనం చేయడంపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలపాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. భౌగోళికంగా టెక్కలికి దగ్గరగా ఉండే నందిగాంను గతంలో పలాస డివిజన్‌లో ఉంచడం వల్ల రైతులు, సామాన్య ప్రజలు రెవెన్యూ పనుల కోసం దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రజల విజ్ఞప్తిని మన్నించి సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.