టెక్కలి డివిజన్‌లోకి నందిగాం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:25 AM
Nandigam in tekkali శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నందిగాం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చింది.
పలాస నుంచి మార్పు
ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
అభ్యంతరాలకు 30 రోజుల గడువు
శ్రీకాకుళం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నందిగాం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు(జీవో ఆర్టీ 1490) జారీచేశారు. ఇది కేవలం ముసాయిదా(ప్రాథమిక) నోటిఫికేషన్ మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం-1974 నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలుపుతూ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే తెలియజేయడానికి అవకాశం కల్పించారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30రోజుల్లోగా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా(తెలుగు లేదా ఇంగ్లీషులో) తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పుపై స్థానికంగా ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గడువులోగా వచ్చిన వినతులను ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది.