పేరు మార్చి.. నిధుల కోత
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:03 AM
Center's share in material component reduced to 60 percent కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇకపై దానిని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) అని పిలువనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
మెటీరియల్ కాంపొనెంట్‌లో కేంద్రం వాటా 75 నుంచి 60 శాతానికి కుదింపు
రహదారుల పనులపై పడనున్న ప్రభావం
మెళియాపుట్టి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇకపై దానిని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) అని పిలువనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉపాధిహామీ పథకం కింద పాత చట్టంలో తప్పనిసరిగా వంద రోజులు పనులు కల్పించగా.. కొత్త బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు. పనులు చేసినవారికి వారం రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. ఇది వేతనదారులకు శుభపరిణామమే అయినా.. ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లో 75 శాతం కేంద్రం వాటాను.. 60 శాతానికి కుదించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాతో పనులు చేసుకోవాలని లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడంతో.. నిధుల కోత ప్రభావం రహదారులు, అభివృద్ధి పనులపై పడే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి విడుదలైన నిధులు సైతం పక్కదారి పట్టాయి. కొన్నిచోట్ల సచివాలయాలు నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినా.. అవి ఎక్కడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంత రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం మంజూరు చేసే మెటీరియల్ కాంపోనెంట్‌లో 75 శాతం ఉపాధి నిధులతో సీసీ రోడ్లు, కాలువల పనులు చేపడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని 13 మండలాల్లో 165 రహదారుల పనులకు ఉపాధిహామీ మెటీరియల్ నిధులను రూ.83.48 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా మెళియాపుట్టి మండలం దీనబంధుపురం పంచాయతీ కుడ్డబ రహదారికి, మెళియాపుట్టి రోడ్డు జంక్షన్ నుంచి రాజపురం రోడ్డుకు సుమారు రూ.2కోట్లకుపైగా నిధులు కేటాయించారు. మెళియాపుట్టి మండలంలో కొండలపై ఉన్న కేరాశింగి, గూడ, చందనగిరితోపాటు పలు గిరిజన గ్రామాలకు ఉపాధిహామీ నిధులు కేటాయించి రహదారి పనులు చేస్తున్నారు. 57 పనులకు సంబంధించి రూ.23.48 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు సాగుతున్నాయి. కాగా తాజాగా కేంద్రం 60 శాతానికి నిధులు కుదించింది. ఒక పనికి రూ.50లక్షల లోపు అంచనాలు ఉంటేనే అనుమతి ఇస్తామని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లలో ఆందోళన కనిపిస్తోంది.
పల్లెపండుగ పనులపైనా..
కూటమి ప్రభుత్వం పల్లెపండుగ పేరిట జిల్లాలో వివిధ శాఖల ద్వారా 9,457 పనులకు రూ.1,453.7కోట్ల ఉపాధి నిధులు మంజూరు చేసింది. ఇందులో రూ.297.58 కోట్లు విలువైన 3,238 పనులు పూర్తయ్యాయి. రూ.486.41 కోట్లు వ్యయంతో 2,234 పనులు వివిధ దశల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో రూ.670.70కోట్ల వ్యయంతో 3,985 పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తాజా నిబంధనలతో ఈ పనులపై ప్రభావం పడుతుంది.
వేతనదారులకు ఉపయోగమే
ఉపాఽధిహామీ పథకంలో మెటీరియల్ వాటా తగ్గటం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. వేతనదారులకు పనిదినాలు 100 నుంచి 125కు పెంచడంతో వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 3.84 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 6.18 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వారందరికీ ఉపయోగం కలుగనుంది.
- నర్సింగ్ ప్రసాద్ పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి