గతి తప్పిన నాగావళి
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:05 AM
sand and aqua mafia with the support of past rulers జిల్లాలో నాగావళి నది గతి మారుతోంది. సముద్రం ముంచుకొస్తోంది. నదీ సంగమ ప్రదేశం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. పక్కా మానవ తప్పిదం. వైసీపీ పాలనలో అక్రమార్కులు సాగించిన విధ్వంసానికి సాక్ష్యం. కాసుల కక్కుర్తి కోసం నదీ గర్భాన్ని చెరబట్టి రొయ్యల చెరువులుగా మార్చేశారు. మరికొందరు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా చేపట్టారు.
నదీ గర్భంపై రొయ్యల పంజా
అక్రమార్కుల దాహానికి బలైపోతున్న తీరం
గత పాలకుల అండతోనే ఇసుక, ఆక్వా మాఫియా విధ్వంసం
ఇప్పుడు సరిచేయాలంటే రూ.98కోట్లు అవసరం
శ్రీకాకుళం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాగావళి నది గతి మారుతోంది. సముద్రం ముంచుకొస్తోంది. నదీ సంగమ ప్రదేశం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. పక్కా మానవ తప్పిదం. వైసీపీ పాలనలో అక్రమార్కులు సాగించిన విధ్వంసానికి సాక్ష్యం. కాసుల కక్కుర్తి కోసం నదీ గర్భాన్ని చెరబట్టి రొయ్యల చెరువులుగా మార్చేశారు. మరికొందరు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా చేపట్టారు. దీంతో ఇప్పుడు ఆ నది ఆగ్రహించి ఊళ్ల మీదకు దూసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక, ఆక్వా మాఫియా ఆడిన వికృత క్రీడకు శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట వంటి గ్రామాలు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాయి.
నది మలుపు తిరిగి.. సంద్రం ముందుకొచ్చి..
బొంతలకోడూరు వద్ద బంగాళాఖాతంలో కలవాల్సిన నాగావళిని.. అక్రమార్కులు తమ స్వార్థం కోసం అడ్డుకున్నారు. పెద్దగనగళ్లవానిపేట పరిధిలోని సర్వే నంబర్ 106లో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో 46 రొయ్యల చెరువులు అనధికారికంగా వెలిశాయి. నాగావళి నది సముద్రంలో కలిసే ముఖద్వారాన్ని పూడ్చేసి ఇసుక తవ్వకాలు చేసి చెరువులను విస్తరించారు. దీంతో నీరు వెళ్లే దారిలేక నాగావళి నది ఏకంగా 90 డిగ్రీలు ఒంపు తిరిగిపోయింది. ఫలితంగా నదీ ప్రవాహం నేరుగా పెద్దగనగళ్లవానిపేట వైపు మళ్లింది. నాగావళి నది గతి మారడంతో సముద్రం కూడా తన ప్రతాపం చూపిస్తోంది. అలల తాకిడికి తీరం కోతకు గురై.. సముద్రం దాదాపు 200మీటర్లు ముందుకు చొచ్చుకువచ్చింది. ఇటీవల నిర్మించిన బీచ్ రోడ్డు కోతకు గురవ్వడమే కాకుండా.. రక్షణగా ఉన్న చెట్లు కూడా నేలకొరిగాయి. ఏ మాత్రం వరద వచ్చినా పెదగనగళ్లపేట గ్రామం జలదిగ్బంధం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
నది గమనం ఒక్కసారి మారాక దాన్ని మళ్లీ సరిచేయడం ఆషామాషీ కాదు.. గైడ్ బండ్స్.. నదిని సముద్రం వైపు మళ్లించడానికి భారీ రాళ్లతో నీటిలో గట్లు నిర్మించాలి. డ్రెడ్జింగ్.. పూడిపోయిన ముఖద్వారాన్ని తెరవడానికి భారీ యంత్రాలతో ఇసుకను తొలగించాలి. తీర రక్షణ.. సముద్రం గ్రామం మీదకు రాకుండా పటిష్టమైన రక్షణ గోడలు కట్టాలి. దీనంతటికీ కలిపి దాదాపు రూ.98 కోట్లు అవుతుందని జలవనరుల శాఖ అంచనా.
గత పాపం.. నేటి శాపం
‘మా ఊరు మునిగిపోతోంది మహోప్రభో’ అని స్థానికులు మొత్తుకున్నా గత వైసీపీ పాలకులు, అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు అందాయో.. లేక వారి అండదండలు ఉన్నాయో కానీ.. ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. కనీస చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు పరిస్థితి ఇంత ప్రమాదకరంగా మారింది. అప్పుడే బాధ్యతతో వ్యవహరించి ఆ 80 ఎకరాల్లో అక్రమ రొయ్యల చెరువులకు, నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇది ముమ్మూటికీ గత పాలకుల అలసత్వమేనని ప్రస్తుత ప్రజాప్రతినిధులు మండి పడుతున్నారు. గత పాలకుల నిర్ల్యక్ష్యం కారణంగా ఇప్పుడు రూ.98 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నిధులతో ఒక ప్రాజెక్టో.. వంతెనో.. ఆస్పత్రి లేదా ఎన్నో రోడ్లు నిర్మించవచ్చు. పాఠశాలలు బాగు చేయొచ్చు. కానీ కొందరి స్వార్థానికి, గత పాలకుల పాపానికి.. ఈ నిధుల భారం తమపై పన్నుల రూపంలో పడుతోందని సామాన్యులు నిటూర్చుతున్నారు. ఇది ముమ్మూటికీ ‘ప్రజల సొమ్ము గంగపాలు’ చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు.