క్షణికావేశంలో హత్యలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:19 AM
జిల్లాలో ఆరు నెలల వ్యవధిలోపదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. క్షణికావేశానికి గురై కొంతమంది ఇటువంటి హత్యలకు పాల్పడుతున్నారు.
- ఆరు నెలల వ్యవధిలోపదుల సంఖ్యలో ఘటనలు
- వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలే కారణం
- కుటుంబాల్లో కానరాని మానవతా విలువలు
- పోలీసులకు సవాల్‌గా మారుతున్న కేసులు
రణస్థలం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
గత నెల 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన గోకర్ల ఈశ్వరరావు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని తోటల్లో యువకుడ్ని హతమార్చారు. ఆయన గొంతుతో పాటు శరీరంలో గాజు సీసాలు బలంగా దింపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల 8న కోటబొమ్మాళిలో పట్టపగలే లక్ష్మి అనే మహిళను గొంతు కోసి నరికి చంపేశాడు ఆమె భర్త తిరుపతిరావు. దంపతులిద్దరి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మి బ్యూటీపార్లర్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతోంది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త తిరుపతిరావు ఆమెతో గొడవకు దిగాడు. అందరూ చూస్తుండగానే పదునైన ఆయుధంతో గొంతుకోసి పరారయ్యాడు. దీంతో ఇద్దరు పిల్లలు ఒంటరయ్యారు.
ఈ ఏడాది ఏప్రిల్ 19న రణస్థలం మండలం పైడిభీమవరం జంక్షన్ సమీపంలోని చెరువు వద్ద భవాని అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేసే ఆమెను చెరువు వద్దకు పిలిచి గొంతుకోశాడు నిందితుడు. వివాహేతర సంబంధం మాటున ఈ హత్య జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది. పోలీసులు నిందితుడ్ని పట్టుకుని జైలుకు పంపించారు.
ఈ ఏడాది జనవరి 20న శ్రీకాకుళం న్యూ కాలనీలో 50 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. పొందూరు మండలానికి చెందిన ఆమె న్యూకాలనీలోని ఓ ప్లాట్‌లో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. శరత్ అనే వ్యక్తి ఆమెను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆర్థిక, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది.
గత ఏడాది డిసెంబరు 16న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామానికి చెందిన దామోదర పద్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త మూడేళ్ల కిందట చనిపోగా ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ తరుణంలో సురేష్ అనే వ్యక్తి చనువు పెంచుకున్నాడు. వారి సాన్నిహిత్యం శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఆమె సురేష్‌ను దూరం పెట్టడంతో తట్టుకోలేక అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు.
జిల్లాలో ఆరు నెలల వ్యవధిలోపదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. క్షణికావేశానికి గురై కొంతమంది ఇటువంటి హత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులే హంతకులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలతో రక్త సంబంధీకులు, కట్టుకున్న భార్యాభర్తలు ఒకరినొకరు హతమార్చుకుంటున్న ఘటనలు జిల్లాలో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధాల వల్లే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. సహ ధర్మచారి వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక క్షణికావేశానికి గురై హత్యలకు తెగబడుతున్నారు. తమ పిల్లలను అనాథలను చేస్తున్నారు.
మారుతున్న మర్డర్ల తీరు..
ప్రస్తుతం హత్యలు చేసేందుకు పన్నుతున్న పన్నాగాలు విస్తుగొలిపేలా ఉంటున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్య, ప్రియుడితో కలిసి భర్తలను హతమార్చుతున్న ఘటనలు ఎక్కు వగా బయటపడుతున్నాయి. వివాహ బంధంతో కలిసి ఉండేందుకు ఇష్టపడకపోవడం, విడిపోవాలంటే వెంటనే వీలుకాకపోవడం వల్ల కూడా హత్యలు పెరుగుతున్నాయి. మరోవైపు మద్యం, గంజాయి మత్తులో మనిషి విచక్షణ కోల్పోతుంటాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగి హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక మనిషి హత్య చేసే పరిస్థితికి వచ్చాడంటే దాని చుట్టూ చాలావరకూ పరిణామాలు జరిగి ఉంటాయి. మద్యం మత్తులో జరిగిన ఘాతుకాలే అధికంగా ఉన్నాయి. పైగా జిల్లాలో విచ్చలవిడిగా పట్టుబడుతున్న గంజాయి చూస్తుంటే ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్థం అవుతోంది. అందుకే మద్యం మత్తులో ఉండేవారితో వీలైనంతగా వాదనలు పెట్టుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
సెల్‌ఫోన్లతో మరిన్ని అనర్ధాలు..
సెల్ ఫోన్లను సద్వినియోగం కంటే దుర్వినియోగానికే ఎక్కువగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో మాటలు కలపడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకోవడం అనేక అనర్ధాలకు కారణమవుతున్నాయి. వేరే వారితో పెట్టుకునే వివాహేతర సంబంధాలు సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చులు పెడుతున్నాయి. హత్యలకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తుల తగదాలతో హత్యలుచేసి పోలీసులను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. చివరికి కటకటాలపాలవుతున్నారు. హత్యలకు సహకరించిన వారికీ శిక్షలు పడుతున్నాయి. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి.
మానవతా విలువలు పెరగాలి..
మనిషిలో మానవతా విలువలు పెరగాలి. అప్పుడే జీవనం బాగుంటుంది. సాఫీగా ముందుకు సాగుతుంది. భార్య, భర్త ఇద్దరూ ఇష్టం లేకుండా కలిసి జీవించడం చాలా కష్టం. అందుకే ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని వివాహ బంధంతో ఒక్కటి కావాలి. అలా కాకుండా పెళ్లి చేసుకున్న తరువాత వారి జీవితంలో వేరేవారు చేరడంతో వివాహేతర సంబంధాలకు దారితీస్తోంది. పెరుగుతున్న ఆస్తి విలువతో డబ్బే ప్రధానంగా మారి రక్తసంబంధీకులనే హత్యచేసే స్థాయికి తీసుకొస్తుంది. మనకున్న దానితో సంతృప్తి చెందడం ప్రశాంత జీవనానికి ముఖ్యం. ఇది గ్రహిస్తే అసలు అనర్థాలే జరగవు.
-బెండి సాయిరామ్, మానసిక వైద్య నిపుణుడు, శ్రీకాకుళం