Share News

srikurmam tempel: శ్రీకూర్మనాథుడి ఆభరణాలపై కదలిక

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:22 AM

ornaments of Sri Kurmanath ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. శ్రీకూర్మనాథుడికి ఏళ్ల కిందట దాతలు సమకూర్చిన బంగారు ఆభరణాలపై ఎట్టకేలకు కదలిక వచ్చింది.

srikurmam tempel: శ్రీకూర్మనాథుడి ఆభరణాలపై కదలిక
శ్రీకూర్మం క్షేత్రం

  • సింహాచలం నుంచి తెచ్చేందుకు ఏర్పాట్లు

  • ఇక్కడే లాకర్‌లో భద్రపరిచేలా చర్యలు

  • గార, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. శ్రీకూర్మనాథుడికి ఏళ్ల కిందట దాతలు సమకూర్చిన బంగారు ఆభరణాలపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారంగా వెలసిన శ్రీకూర్మక్షేత్రాన్ని దేవతలు ప్రతిష్టించినట్టు చరిత్ర చెబుతోంది. రాజుల కాలంలో పలువురు స్వామికి సమర్పించిన భూములు, కానుకలకు సంబంధించి శాసనాల్లో పొందుపరిచారు. విజయనగరం గజపతులు ఈ దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

  • శ్రీకూర్మనాథుడికి సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆభరణాలను దశాబ్దాల కిందట స్వామికి జరిగే వివిధ ప్రత్యేక ఉత్సవాల్లో అలంకరించేవారు. అప్పట్లో విలువైన బంగారు ఆభరణాలు ఇక్కడ భద్రపర్చడానికి అనువైన లాకర్లు అందుబాటులో లేవు. దీంతో 1978లో అప్పటి దేవాలయ అధికారులు ఈ ఆభరణాలను సింహాచలం దేవస్థానంలో భ ద్రపరిచారు. అప్పటి నుంచి స్వామికి జరిగే డోలోత్సవం, కల్యాణం, మొదలైన ప్రత్యేక ఉత్సవాల్లో ఇక్కడ ఉన్న వెండి ఆభరణాలను అలంకరిస్తున్నారు. ఇటీవల ఈ ఆలయాన్ని వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్న కేంద్రమాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరావు సందర్శించారు. స్వామికి ఆభరణలు అలంకరణ లేకపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దేవదాయశాఖ అధికారులను అడగ్గా.. సింహాచలం దేవస్థానంలో భద్రపరిచినట్టు తెలిపారు. దీనిపై అశోక్‌గజపతిరాజు స్పందిస్తూ అక్కడి నుంచి ఆభరణాలు తెప్పించి కూర్మనాథుడికి ఉత్సవాల సమయంలో అలంకరించాలని తెలిపారు. వాటిని ఇక్కడే లాకర్‌ ఏర్పాటు చేసి భద్రపరచాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సింహాచలం నుంచి బంగారు ఆభరణాలను తెప్పించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకూర్మంలో లాకర్‌ ఏర్పాటు కోసం బ్యాంకు అధికారులను సంప్రదించారు. త్వరలో శ్రీకూర్మనాథ క్షేత్రానికి ప్రత్యేక భద్రత నడుమ బంగారు ఆభరణాలు రానున్నాయి.

  • లేఖ రాశాం

  • కేంద్ర మాజీ మంత్రి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ఆదేశాల మేరకు శ్రీకూర్మనాథుని బంగారు ఆభరణాలు అప్పగించాలని కోరుతూ సింహాచలం దేవస్థానం అధికారులకు ఇటీవల లేఖ రాశాను. ఆభరణాలు అప్పగిస్తే శ్రీకూర్మంలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. బ్యాంకులో ఒక లాకర్‌ ఉంచాలని అధికారులను కూడా కోరాం.

    - ఎం.నరసింహనాయుడు, ఈవో, శ్రీకూర్మం

Updated Date - Aug 24 , 2025 | 12:22 AM